ఏపీలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలదీ తలోదారిలా కనిపిస్తోంది. త్వరలో పార్టీకి కేశినేని నాని పార్టీకి రాజీనామా చేయనుండగా మిగతా ఎంపీలైన గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు ఈసారి పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.దీంతో ఎంపీగా బరిలో నిలిచే వారి కోసం తెలుగుదేశం పార్టీ అధిష్టానం అన్వేషణ.. చేపట్టాల్సిన పరిస్థితి దాపురించింది.చంద్రబాబు టార్గెట్లను చూసి భయపడుతున్న నేతలు మేం పోటీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు.ఫలితంగా లోక్‌సభకు పోటీ చేసేందుకు ఆ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారబోతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. ఎల్లో మీడియా జాకీలు వేసి లేపినా.. ఆహా ఓహో అంటూ ప్రచారం చేసినా ఎక్కడా ప్రయోజనం కనిపించడం లేదు. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలూ తలోదారిలో చూసుకుంటున్నారు.ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీకి, పదవికి రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక గుంటూరు ఎంపీగా ఉన్న జయదేవ్ చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కూడా ఈసారి పోటీ చేయలేనని తేల్చి చెప్పారు.
అటు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీలే ఇలా పోటీకి ఆసక్తి చూపకపోవడంతో మిగతావాళ్లు కూడా ముందుకు రావడం లేదు. మిగతానియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.ఎంపీగా పోటీ చేసే వారికి చంద్రబాబు పెడుతున్న టార్గెట్లే పోటీకి దూరంగా ఉండటానికి కారణమని ప్రచారం జరుగుతోంది.రాయలసీమలో తిరుపతి స్థానం నుంచి పోటీలో ఉండే సినీనటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ దొరకడం లేదు. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి కరువయ్యాడు.కర్నూలు నుంచి గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేశారు.
ఆయన కూడా ఈసారి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచడం లేదని సమాచారం.అలాగే నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి ఇప్పుడు పార్టీకి దూరమయ్యాడు.బాపట్లలో పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్ పరిస్థితి కూడా అంతే. కడపలో పోటీ చేసే అభ్యర్థి కోసం టీడీపీ అధిష్టానం నానా తంటాలు పడుతోంది.ఇలా 25 నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. పార్టీ పరిస్థితి దిగజారడమే దీనికి కారణమని పార్టీలోని నేతలే చర్చించుకుంటున్నారు.ఇక్కడ ఎవ్వరూ అంతమాత్రం లేకపోవడంతో పక్కపార్టీ నుంచి వచ్చే వాళ్ళయినా ఎంపీలుగా పోటీ చేస్తారేమోనని అధినేత ఎదురుచూస్తున్నారు.తెలుగుదేశం పార్టీ బంగాళాఖాతంలో కలవడం ఖాయమని గత రెండేళ్ళుగా వైసీపీ నేతలు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉందని జనాలు అనుకుంటున్నారు.