గడిచిన వారం రోజులుగా ఏపీలో విద్యుత్ రాజకీయాలు పుంజుకున్నాయి. శ్లాబులు మార్చారని, దీంతో పెద్ద ఎత్తున కరెంటు బిల్లులు వచ్చాయని నిన్న మొన్నటి వరకు ఆందోళన చేసిన టీడీపీ.. ఇప్పుడు ఒక్కసారి గా వ్యూహం మార్చుకుని, అసలు లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు పనులే లేకుండా పోయాయి.. కాబట్టి వారిదగ్గర డబ్బులు లేవని, సో.. బిల్లుల వసూళ్లకు బ్రేకులు వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పట్టుబడుతున్నారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో విద్యుత్ నిరసనలు చేపట్టాలని తమ్ముళ్లకు పెద్ద ఎత్తున పిలుపునిచ్చారు. ఇది రాజకీయంగా కీలకంగా మారింది.
దీనిపై ఇప్పటికే జగన్ ప్రభుత్వం తరఫున మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ పాపం తమది కాదని గత ప్రభుత్వమే.. టారిఫ్‌లు మార్చేలా వ్యవహరించిందని చెప్పకనే ఆయన చెప్పారు. ఇది. ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రతిపక్షాన్ని కూడా ఇబ్బందుల్లోకినెట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఈ విషయా న్ని వదిలేసిన ఇరు పార్టీలూ ఇప్పుడు బిల్లుల విషయంపైనే రగడ చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో విద్యు త్ బిల్లుల శ్లాబులను మార్చాలనే ప్రతిపాదన గత చంద్రబాబు ప్రభుత్వంలోనే సాగింది. అయితే, ఆయన అధికారంలో చివరిలో ఉన్న సమయంలో దీనిని వాయిదా వేశారు.
ఆ వెంటనే అధికారంలోకి వచ్చాక జగన్ దీనిపై కమిటీని వేసి.. డైనమిక్ రీతిలో శ్లాబులు వేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా 500 యూనిట్లు దాటిన ప్రతి ఒక్కరికీ ఒకింత ఎక్కువగానే బిల్లులు వచ్చాయి. నిజానికి ఇది టీడీపీ ప్రభుత్వ హయాంలోని నిర్ణయం. అయితే, దీనినే మేం అమలు చేస్తున్నాం.. అని చెప్పుకొంటే.. అయితే, అన్న క్యాంటీన్లు, చంద్రన్న బీమా వంటివి కూడా అమలు చేయాలని డిమాండ్ తెరమీదికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈవిషయాన్ని అధికార పార్టీ దాచిపెట్టింది. ఇక, శ్లాబుల విషయం తమదేనని చెప్పుకొంటే..
ఇంకా తమ పరువు పోతుందనే భయంతో టీడీపీ దీనిపై వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది.ఈ క్రమంలోనే కేవలం బిల్లుల పెంపును రాజకీయం చేసింది. అయితే, 2001-02 మధ్య చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెంచినప్పుడు కాల్పులకుదారి తీసిన పరిణామాలను వైసీపీ నేతలు తెరమీదికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు విద్యుత్ బిల్లుల విషయం రగడకు దారితీస్తోంది. ఏతావాతా ఎలా చూసినా.. ఇరు పక్షాలదీ తప్పుందనే అభిప్రాయం సర్వత్రా విస్మయం కలిగిస్తోంది.