ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా రసవత్తరంగా మారాయి. ఓవైపు అధికార వైసీపీ.. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ-టీడీపీ-జనసేన.. ఇంకో వైపు కాంగ్రెస్ పార్టీలు బరిలోకి దిగుతున్నాయి. ప్రధానంగా వైసీపీ, కూటమి మధ్య రసవత్తర పోరు కనిపిస్తున్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకుంటుంది. ముఖ్యంగా షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా ఎన్నికైనప్పటి నుంచి కాంగ్రెస్ కాస్త మార్పు కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. తాజాగా నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది అనే చెప్పాలి. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వై.ఎస్. షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ దారా సుధీర్ కి కేటాయించడం, బైరెడ్డి సిద్దార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 50 రోజులకు పైగా సమయం ఉండటంతో ముందు ముందు ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరీ.