వన్ ఇయర్ స్పెషల్: పవనావేశం ప్రశ్నార్థకం!

-

“పరుచుకున్న ముళ్లకంచె తెంచడానికై.. ప్రజాస్వామ్య పరిరక్షణ చేయడానికై” అంటూ పవన్ నేతృత్వంలో జనసేన ఆవిర్భవించింది. ప్రజారాజ్యంలా కాకుండా కచ్చితంగా నిలబడతాడు అనే భరోసా కల్పించే దిశగా కొన్ని కార్యక్రమాలు చేసింది జనసేన! తమ సామాజికవర్గం నుంచి ఒక నాయకుడు వస్తున్నాడని కొందరు.. మార్పు మంచిదే అని ఇంకొందరు.. కొత్తతరం రావాలని మరికొందరు.. ఇలా పవన్ పై చాలా మంది చాలా ఆశలే పెట్టుకున్నారు. అప్పటికి ఇంకా ఓటు హక్కు రాని యువత అయితే ఇంకా ఎక్కువ ఆశలే పెట్టుకున్నారు! పవన్ ఎక్కడ మీటింగ్ పెట్టినా తండోప తండాలుగా ఎగురుకుంటూ వచ్చారు! పవన్ అది నిలబెట్టుకున్నారా… పవన్ పొలిటికల్ కెరీర్ ను ఎవరు ప్రశ్నార్ధకం చేశారు?

తాను ఏ పని ఎత్తుకున్నా అది మధ్యలోనే ఆపేస్తానని, ఏమాట చెప్పినా దానిపై నిలబడేది తనకు కష్టమని పవన్ చాలా సార్లే నిరూపించుకున్నారు! పార్టీ పెట్టిన కొత్తల్లో అధికారం మీద ఆశలేదన్న పవన్ కళ్యాణ్ అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గరపడేసరికి ఉత్తరాంధ్ర పర్యటనలో “సీఎం అవుతానని.. తనను గెలిపించండని” ప్రజలను కోరారు! బాబుతో చెడటమే దానికి కారణమో లేక తానుకూడా రేసులో ఉన్నానని చెప్పడమే కారణమో తెలియదు కానీ.. పార్టీ పెట్టిన కొన్నేళ్లలోనే అలా మాట మార్చారు పవన్! ఇదే క్రమంలో ఇక తానెత్తుకున్న ఉద్యమాల సంగతంటారా… శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులకు అండగా నిలిచేందుకు పవన్ రెండు రోజుల పాటు అక్కడ పర్యటించారు.. అనంతరం ఏమిజరిగిందన్న విషయం పవన్ ఇప్పటికీ పట్టించుకోకుండా వదిలేశారు.

ఇదే క్రమంలో రాజధాని రైతుల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు రాజధాని విషయంలో వెనకడుగు వేసినట్లే కనిపిస్తున్నారు! ప్రభుత్వం మూడు రాజధానులు బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కానీ పవన్ ఆమరణ దీక్ష స్థాయిలో స్పందించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు! అమరావతి రైతులకు సంఘీభావంగా ప్రకటించిన లాంగ్ మార్చ్ ఊసే ఎత్తడం లేదు. ఇక కొద్ది రోజుల క్రితం విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అండగా నిలబడతాం అంటూ ప్రకటించారు. అప్పటికే ప్రభుత్వం ఈ ఘటనలో మరణించిన బాధితుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం.. ఐదు గ్రామాల ప్రజలకు కుటుంబానికి పదివేలు చొప్పున పరిహారం అందించేసింది!

నాడూ నేడూ ఇలా పవన్ రాజకీయ జీవితం ప్రశ్నార్ధకం అవుతూనే ఉంది! అందులో 2014 ఎన్నికల సమయంలో బాబు పంచన చేరడంతో కాస్త పోగా.. 2019 ఎన్నికల నాటికి తానే సీఎం అన్నట్లు ప్రకటించుకోవడంతో మరి కొంత పోయింది! తాను సీఎం అవుతాను, అయ్యి తీరతాను అన్న మాటల స్థానే… “జగన్ మోహన్ రెడ్డి ఎలా సీఎం అవుతాడో చూస్తా… జగన్ నిన్ను సీఎం కానివ్వను..” అని వీరావేశంతోనో, వీర అహంకారంతో పవన్ మాట్లాడిన మాటలు.. అనంతరం జగన్ సీఎం అవ్వడం, ప్రమాణస్వీకారం చేసి నేటికి ఏడాది అవ్వడంతో ఇక మిగిలిన కాస్తా పోయిందని అంటున్నారు!

నిజంగా జగన్ ని సీఎం కానివ్వకపోవడమే పవన్ లక్ష్యమైతే… ఆ లక్ష్యం బలమైంది అయితే… ఇప్పటికైనా పవన్ తన పోరాటాన్ని కొనసాగించొచ్చు! కానీ… వచ్చిన ప్రతీ అవకాశాన్ని ట్విట్టర్ వేదికగా వదులుకుంటున్న పవన్… జగన్ పై గతంలో చూపించింది ఆవేశం కాదు, ఆయాసం మాత్రమే అనే కామెంట్లు వినిపించడానికి కారణమవుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news