వైసీపీలో అవినీతి అలజడి… అడ్డంగా బుక్ అవుతోన్న టాప్ నేత‌లు..!

-

సాధారణంగా అధికార పార్టీపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సహజం. అధికార నేతలు అకారమలు, అవినీతికి పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటాయి. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందా లేదా అనేది అప్పటికప్పుడు ఉండే పరిస్థితులని బట్టి అర్ధమైపోతుంది. ఆ విషయం ప్రజలకు కూడా స్పష్టంగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని ఏది గుడ్డిగా నమ్మరు. అలా అని అవినీతి చేసి కూడా తాము చేయలేదని అధికార పార్టీ నేతలు చెప్పినా నమ్మే పరిస్తితి ఉండదు.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేసింది. ఆ విమర్శల్లో వాస్తవాలని ప్రజలు గమనించడం వల్లే ఎన్నికల్లో టీడీపీ నేతలనీ ఓడించారు. ఇప్పుడు సీన్ రిపీట్ అయింది. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ ఆరోపణలు చేస్తుంది. ఇక ఈ ఆరోపణల విషయంలో ప్రజలు కూడా వాస్తవాలు గ్రహిస్తున్నారు. వైసీపీ నేతలు కాస్త అక్రమాలు చేస్తున్నట్లే ప్రజలు నమ్ముతున్నట్లు కనబడుతోంది. జగన్ అందించే సంక్షేమం వల్ల‌ ఈ విషయాలు పెద్దగా హైలైట్ కావట్లేదని తెలుస్తోంది.

కానీ టీడీపీ మాత్రం ఏదొరకంగా వైసీపీ నేతల అక్రమాలు బయటపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఇళ్ల పట్టాల్లో జరిగిన అవినీతిపై చాలావరకు అక్రమాలు జరిగినట్లు చూపించారు. అలాగే తాజాగా మంత్రి జయరాంని అయితే ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఆయనపై ఎన్నిరకాల ఆరోపణలు వచ్చాయో తెలిసిందే. అటు తమ్మినేని సీతారాం అనుచరులు అసెంబ్లీలో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్నారని, తమ్మినేని సొంత బామ్మర్ది, టీడీపీ నేత కూన రవికుమార్ ఆరోపిస్తున్నారు.

ఇళ్ల పట్టాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు అవినీతి చాలా ఎక్కువగా ఉందని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఇటు వైసీపీ నేతల అక్రమ మైనింగ్‌పై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. అంబటి రాంబాబు, వసంత కృష్ణప్రసాద్, బొల్లా బ్రహ్మనాయుడులపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. అసలు అంబటిపై అయితే సొంత పార్టీ కార్యకర్తలే కోర్టులో పిటిషన్ వేశారు.

ఇక మేరుగ నాగార్జున సొసైటీ భూమిలో అక్రమ మైనింగ్ ఆపాలని హైకోర్టు నోటీసులిచ్చింది. ఇక సి‌ఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా గోల్‌మాల్ జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. ఇలా రాష్ట్రంలో వైసీపీ నేతలపై ఏదొరకమైన అవినీతి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

– Vuyyuri Subhash

Read more RELATED
Recommended to you

Latest news