పార్టీ పండగలు: వైకాపా ఆఫ్ లైన్… టీడీపీ ఆన్ లైన్!

వైసీపీ అధికారంలోకి వచ్చి ఈ నెల 23వ తేదీకి ఏడాది అవుతుంది. దీంతో ఈ సందర్భాన్ని పండగలా నిర్వహించుకుందామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ భారీ మెజార్టీతో గెలుపొంది ఈ నెల 23 నాటికి సరిగ్గా ఏడాది అయిందని… ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా వైయస్ జగన్‌ సమూలమైన మార్పులు తెచ్చారని ఆయన చెబుతున్నారు! ఈ క్రమంలో ఈ నెల 23 నుంచి జగన్ ప్రమాణస్వీకారం చేసిన మే 30 వరకూ ఈ సంబరాలు జరగనున్నాయి! ఇదే క్రమంలో టీడీపీ కూడా మహానాడు వేడుకలకు ముహూర్తం ప్రకటించింది.

పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి కలిసివచ్చేలా ఏటా మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించడం టీడీపీకి ఆనవాయితీ! గత ఏడాది ఎన్నికల కారణంగా ఈ మహానాడు జరగలేదు!! ఈసారి కరోనా ఎఫెక్ట్ కారణంగా… ఈ వేడుకలను రెండు రోజుల పాటు.. రోజుకి మూడు గంటల చొప్పున నిర్వహించాలని బాబు ప్లాన్ చేశారు! 27వ తేదీన ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర ఈ కార్యక్రమం ఉండగా.. 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళులర్పించే కార్యక్రమం కొనసాగుతుంది!

ఇక్కడ విశేషం ఏమిటంటే… తొలి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 90శాతం నెరవేర్చిన ముఖ్యమంత్రి జగన్ కు కృతజ్ఞతగా అన్నట్లుగా 23వ తేదీన అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్‌తో పాటు మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఎగరేసేలా వైకాపా ప్లాన్ చేసుకుంటుంటే… మహనాడు కార్యక్రమాలను మాత్రం జూం యాప్ ద్వారా నిర్వహించాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు!!