జంతువులకూ వ్యాప్తి చెందుతున్న కరోనా.. జాగ్రత్త..!

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు చెందిన కొత్త వేరియెంట్లు ప్రజలను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రోజూ భారీగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రస్తుతం జంతువులకు కూడా కరోనా సోకుతుండడం మరింత ఆందోళనను కలిగిస్తోంది. అమెరికాలోని అట్లాంటా సిటీలో ఉన్న ది జార్జియా అక్వేరియంలో తాజాగా బీవర్లు అనే జంతువులు కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డాయి.

తమ వద్ద ఉన్న బీవర్లలో కొన్నింటికి కరోనా సోకిందని, ముక్కు కారడం, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు వాటికి ఉన్నాయని సదరు అక్వేరియం నిర్వాహకులు ట్వీట్‌ చేశారు. ఆ బీవర్లు ఆసియా జాతికి చెందినవని తెలిపారు. ఈ సందర్బంగా జార్జియా అక్వేరియం యానిమల్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ టోన్యా క్లాజ్‌ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్‌ బారిన పడిన ఆ బీవర్లను నిపుణులు పర్యవేక్షిస్తున్నారని, వాటిని ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో ఉంచామని, జంతు వైద్య నిపుణులు వాటికి చికిత్సను అందిస్తున్నారని తెలిపారు.

అయితే ఆ బీవర్లకు సోకిన కోవిడ్‌ వేరియెంట్‌ గురించిన వివరాలు ఇంకా తెలియవు. కానీ జంతువులకు కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తుందని డాక్టర్‌ టోన్యా అన్నారు. కాగా బీవర్లు ముంగిస లాంటి జాతికి చెందిన జంతువులు. వీటితోపాటు పలు ఇతర జీవులకు కూడా కరోనా సోకింది. గతేడాది డిసెంబర్‌లో లూయీస్‌ విల్లె జూలో ఓ చిరుతకు కరోనా సోకగా ఊతా, విస్కాన్‌సిన్‌లలో ముంగిస జాతికి చెందిన మింక్స్‌ అనే జీవులకు కోవిడ్‌ సోకింది. అవి చనిపోయాయి. అలాగే కొన్ని కుక్కలు, పిల్లులకు కూడా కోవిడ్‌ సోకిందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న జూల నిర్వాహకులను ఈ విషయం పట్ల హెచ్చరిస్తున్నారు. జంతువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version