ముంబయి: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో రైతన్నల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్ తో రైతు ఉద్యమంపై కొంత ప్రతికూల ప్రభావం పడినప్పటికీ.. ఇంకా రైతులు ఢిల్లీ సరిహద్దులో ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతిపై అలుపెరుగని పోరాటం సాగిస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే రైతు ఉద్యమానికి అండగా నిలుస్తున్నారు.
దీనిలో భాగంగానే దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనికి అనుగుణంగా ఈ నెల 30 నుంచి తన సోంత పట్టణమైన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా రాలేగావ్‌లో సిద్ధిలో రైతు సమస్యల పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ.. నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నట్టు ఆయన వెల్లడించారు. తన మద్ధతుదారులతో పాటు రైతులకు అండగా నిలిచేవారు వారివారి ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం దేశంలోని వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందనీ, అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నా హజారే అన్నారు. అయితే, రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అన్నదాతల సమస్యలు కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. గత మూడు నెలల్లో ప్రధాని మోడీకి ఈ విషయమై లేఖలు రాశాననీ, అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు.