భారత దేశం నుంచి వివిధ క్రీడాంశాల్లో చాలా మందే టోక్యో ఒలంపిక్స్ కోసం వెళ్లారు. అందులో కొంత మంది ఎటువంటి అంచనాలు లేకపోయినా సత్తా చాటగా… ఎన్నో అంచనాలు ఉన్న కొద్ది మంది క్రీడాకారులు మాత్రం ఉత్త చేతులతో తిరిగొచ్చారు. క్రీడల్లో విజయం అనేది అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయించబడుతుంది. ఈ వాస్తవాన్ని అందరూ ఒప్పుకుని తీరాలి. అలా హాకీలో మనదేశం తరఫున పురుషుల హాకీ ఒలంపిక్స్ మెడల్ రాక దాదాపు 41 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ సారి మన హాకీ జట్టు కాంస్య పతకం సాధించి మెడల్ కళను నిజం చేసి చూపించింది. కాగా మన దేశానికి మెడల్ వస్తుందని ఆశ లేని క్రీడ గోల్ఫ్ అయినప్పటికీ క్రీడాకారిణిని మాత్రం టోక్యో ఒలంపిక్స్ విమానమెక్కించారు.
కానీ అదృష్టం కలిసి వస్తే ఈ ఈవెంట్లో కూడా భారత్ కు మెడల్ వచ్చే చాన్స్ కనిపిస్తోంది. కాగా ఈ క్రీడలో యువ కెరటం అదితి అశోక్ ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగింది. కానీ అందరూ ఆశ్చర్యపోయేలా అదరగొడుతూ… పతకానికి మెట్టు దూరంలో నిలిచింది. రేపు కనుక టోక్యో లో వర్షం పడి నాలుగో రౌండ్ గోల్ఫ్ రద్దయితే ఇప్పటి వరకు ఉన్న వారినే విజేతలుగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం అశోక్ 201 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అమెరికాకు చెందిన కొర్దా నెల్లీ అనే క్రీడాకిరిణి 198 పాయింట్లతో ప్రథమ స్థానంలో ఉంది. అదేంటి మన అమ్మాయి కన్నా తక్కువ స్కోరు ఉన్న అమెరికా క్రీడాకారిణి తొలి స్థానంలో ఎలా నిలిచిందా అని అందరూ ఆశ్చర్యపోవడం సహజం. కానీ గోల్ఫ్ లో ఎవరికి తక్కువ పాయింట్లు ఉంటే వారే విజేతలుగా నిలుస్తారు.