టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు.. మళ్లీ చిక్కుల్లో పడ్డారా? ఆయన చేసిన సంచలన కామెంట్లు ఇప్పుడు మరో కేసుకు దారితీస్తున్నాయా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా చంద్రబాబు కొన్ని కామెంట్లు చేశారు. అచ్చెన్నాయుడు అరెస్టును జీర్ణించుకోలేక పోతున్న చంద్రబాబు ఈ విషయంలో ఎలా ముందుకువెళ్లాలి? అనే విషయంలో తనదైన వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. ఈరోజో.. రేపో.. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిలకు బెయిల్ ఇప్పించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఈ సమయంలో అచ్చెన్నాయుడుకు సంబంధించి చంద్రబాబు ఆ సక్తికర కామెంట్లు చేశారు. గత అసెంబ్లీ సెషన్ ముగిసిన తర్వాత.. అచ్చెన్నాయుడుతో వైసీపీ కీలక నేత .. ఉత్తరాంధ్ర జిల్లాల వ్యవహారాలు చూస్తున్న జగన్ మద్దతుదారు.. నేరుగా అచ్చెన్నను కలిశారని చంద్ర బాబు చెప్పారు. టీడీపీని వీడి వచ్చేయాలని కోరారని..ఈ క్రమంలోనే రూ.50 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశార ని, అయితే, దీనికి అచ్చెన్నాయుడు అంగీకరించలేదని చంద్రబాబు తాజాగా బాంబు పేల్చారు.
టీడీపీని వీడి రాలేదు కాబట్టే.. ఇప్పుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఇప్పుడు రూ.50 కోట్ల విషయంలో మాట్లాడడం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇది నిజమే అయితే.. అప్పట్లోనే దీనిని చంద్రబాబు ఎందుకు వెల్లడించలేదు. అంతేకాదు, ఇది ఒక రకంగా ప్రజాప్రతినిధి కొనుగోలు చేయడం కిందకే వస్తుంది కాబట్టి.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. కోర్టులు కూడా తీవ్రంగా పరిగణిస్తాయి. ఈ ఒక్క కేసు ద్వారా జగన్ ప్రభుత్వాన్ని సైతం కూలగొట్టే అవకాశం ఉంటుందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
అయినా కూడా చంద్రబాబు.. అప్పట్లో ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు. ఇంత చక్కటి విషయాన్ని ఎందుకు వదిలేశారు. ఒక వేళ ఇది ఇప్పుడు అవసరార్థం వినియోగించుకుంటే.. తిరిగి చంద్రబాబుకు ఇబ్బంది తప్పదు! ఇప్పుడు ఇదే అంశంపై సదరు ఆఫర్ చేసిన నాయకుడు కోర్టుకు వెళ్తానని చెబుతున్నారు. మొత్తానికి ఒక కేసు విషయాన్ని వదిలేసి.. మరోకేసులో ఇరుక్కునేలా ఉంది చంద్రబాబు వ్యవహారం అంటున్నారు పరిశీలకులు.