కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా సైంటిస్టులు శ్రమిస్తుంటే.. మరోవైపు వైద్య నిపుణులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు మెడిసిన్లనే కోవిడ్ చికిత్సకు వాడుతూ పేషెంట్ల ప్రాణాలను కాపాడుతున్నారు. ఇక ప్రస్తుతం పలు రకాల డ్రగ్‌లు కోవిడ్ చికిత్సకు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా సైంటిస్టులు మరొక డ్రగ్ కోవిడ్‌పై ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని గుర్తించారు. యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్ అయిన ఫెనోఫైబ్రేట్ కోవిడ్ ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుందని తేల్చారు. ఈ మేరకు హెబ్రూ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
ఫెనోఫైబ్రేట్ మెడిసిన్‌ను హై కొలెస్ట్రాల్ ఉన్నవారికి, గుండె జబ్బుల బారిన పడ్డవారికి, పలువురు డయాబెటిస్ పేషెంట్లకు ఇప్పటికే ఇస్తున్నారు. ఈ మెడిసిన్ వల్ల వారిలో కొలెస్ట్రాల్ ఎప్పటికప్పుడు తగ్గి అదుపులో ఉంటుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇదే మెడిసిన్ కోవిడ్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించారు. సాధారణంగా కరోనా వైరస్ మనిషి శరీరంలోకి ప్రవేశించాక మొదటగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడ తమ సంఖ్యను వృద్ధి చేసుకుంటుంది. అందుకు గాను ఆ వైరస్ మన శరీరంలోని కొవ్వు నిల్వలను వాడుకుంటుంది. ఈ క్రమంలో ఊపిరితిత్తుల్లో కొవ్వు చేరుతుంది. అయితే ఫెనోఫైబ్రేట్ వాడడం వల్ల ఊపిరితిత్తుల్లో అలా చేరే కొవ్వును ఎప్పటికప్పుడు తొలగించవచ్చు. దీంతో వైరస్‌కు వృద్ధి చెందేందుకు అవకాశం ఉండదు. ఫలితంగా వైరస్ బలహీనమవుతుంది. ఈ క్రమంలో 5 రోజుల వ్యవధిలోనే వైరస్ పూర్తిగా నశిస్తుంది. అందువల్ల ఈ మెడిసిన్ కోవిడ్‌పై అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు.
ఫెనోఫైబ్రేట్ మెడిసిన్ నిజానికి అంత ఖరీదైన మెడిసిన్ కూడా ఏమీ కాదు. దీన్ని ఇప్పటికే యాంటీ కొలెస్ట్రాల్ డ్రగ్‌గా వాడుతున్నారు. పేషెంట్లలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఈ మెడిసిన్ ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఇదే మెడిసిన్ కోవిడ్‌పై పనిచేస్తుండడం శుభ పరిణామమని సైంటిస్టులు అంటున్నారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తామని వారంటున్నారు. ఇక సైంటిస్టులకు చెందిన ఈ మెడిసిన్ అధ్యయన వివరాలను మరో వారంలో సెల్ ప్రెస్ జర్నల్‌లో ప్రచురించనున్నారు.