ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడు పెంచారు. ఇంతకాలం ఏదో పైపైన మాత్రమే పనిచేస్తున్నట్లు కనిపించిన సోము…ఇప్పుడు అధికార వైసీపీపై దూకుడుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మొన్నటివరకు సోము అంతగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయని సంగతి తెలిసిందే. ఈయన ఎంతసేపు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపైనే విమర్శలు చేస్తూ వచ్చారు. దీని వల్ల బీజేపీకి ఒరిగింది ఏమి లేదు.
అయితే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ బండి పూర్తిగా అధికార టీఆర్ఎస్‌నే టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. దీని వల్ల బీజేపీ పుంజుకునే పరిస్తితికి వచ్చింది. కానీ ఏపీలో సోము అలా చేయకపోవడం వల్ల బీజేపీ ఏ మాత్రం పికప్ అవ్వలేదు. ఇక ఇప్పుడు సోము దూకుడు పెంచారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.
అనూహ్యంగా మద్యం విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసి రాష్ట్ర రాజకీయాల్లో హైలైట్ అయ్యారు. బీజేపీని గెలిపిస్తే చీప్ లిక్కర్‌ని రూ.70కే అందిస్తామని మాట్లాడారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయినా సరే సోము వెనక్కి తగ్గలేదు. ఇంకా ఊహించని హామీలు ఇచ్చేస్తున్నారు. సన్నబియ్యం కిలో 40రూపాయలకు అందిస్తామని.. అదే విధంగా టమోటా, ఉల్లితో పాటు పలు రకాల నిత్యవసరాల ధరలు తగ్గిస్తామని ప్రకటనలు చేసేస్తున్నారు. ఇలా సోము తెగ హామీలు ఇచ్చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఊహించని విధంగా గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలని సోము డిమాండ్ చేస్తున్నారు. దేశ విభజనకు కారణమైన జిన్నా పేరుతో ఉన్న స్థూపం పేరును మార్చాలని, లేదంటే స్థూపాన్నే తొలగించాలని అంటున్నారు. పాకిస్థాన్ జాతిపితగా పిలుచుకునే మహమ్మద్ అలీ జిన్నా పేరుతో ఏర్పాటు చేసిన స్థూపం గుంటూరులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దాని చుట్టూ బీజేపీ పోలిటికల్ గేమ్ స్టార్ట్ చేసింది. మొత్తానికైతే ఇన్నాళ్లకు సోము వీర్రాజు దూకుడుగా రాజకీయం చేయడం స్టార్ట్ చేశారు.