ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు ఆయన ప్రకటించారు. కాగ కరోనా వైరస్ తో పాటు ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ కావడంతో థర్డ్ వేవ్ వల్ల వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి నైట్ కర్ఫ్యూను విధించింది. అయితే తాజా గా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి భారీగా తగ్గింది.
గత కొద్ది రోజుల నుంచి 1000 కేసుల దిగవనే వస్తున్నాయి. ఈ రోజు 500 కన్నా.. తక్కువగా 434 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. దీంతో నైట్ కర్ఫ్యూ ఎత్తి వేయాలని ముఖ్య మంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రజలు అందరూ కూడా మాస్క్ లను తప్పని సరిగా ధరించాలని సూచించారు. అలాగే భౌతిక దూరం కూడా పాటించాలని అన్నారు. వీటితో పాటు కరోనా నిబంధనలను తప్పక పాటించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో ఫీవర్ సర్వేను ఎప్పటి లాగే కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తి చేసే ప్రక్రియా కూడా కొనసాగించాలని సంబంధిత అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.