ఏపీ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని రేపు ప్రారంభించనుంది. రేషన్ కార్డున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచేలా ‘వైయస్సార్ బీమా పథకాన్ని’ ప్రారంభించనుంది. కుటుంబ పెద్ద సాధారణ లేక ప్రమాదవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబాన్ని ఆదుకోవటమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకం కోసం ఇప్పటికే 510 కోట్లకు పైగా నిధుల కేటాయించింది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 1 కోటి 41 లక్షల కుటుంబాలకు లబ్ది చేకురనుంది.
18 నుంచి 70 ఏళ్ల లోపు వయస్సు ఉండి కుటుంబాన్ని పోషించే వారికి ఈ పథకం వర్తించనుంది. 18–50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న లబ్ధిదారుడు సహజ మరణం పొందితే 2 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి 5 లక్షలు బీమా పరిహారం చెల్లించనుంది ప్రభుత్వం. ప్రమాదవశాత్తు పూర్తి అంగవైకల్యం పొందితే 5 లక్షలు బీమా పరిహారం ఇవ్వనుంది. 51–70 ఏళ్ల మధ్య వయస్సు లబ్ధిదారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి 3 లక్షల పరిహారం,శాశ్వత అంగవైకల్యం పొందితే 3 లక్షలు బీమా పరిహారం చెల్లించనుంది. వైయస్సార్ బీమా పథకంలో పూర్తి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించనుంది.