వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటినుంచీ… అసెంబ్లీ వేదికగా “ఆ రెండు పత్రికలు” అనే మాట చాలా ఫేమస్! నేరుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన కథనాలు ఎంత తప్పుగా ఉన్నాయో.. పనిగట్టుకుని, కక్షపూరితంగా తన ప్రభుత్వంపైనా, తన పాలనపైనా ఎన్ని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారో.. నేరుగా సీఎం హోదాలో డా. వైఎస్సార్ అసెంబ్లీలో చదివి వినిపించేవారు! ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ క్రమంలో హైకోర్టులో జగన్ కు ఎన్ని ఇబ్బందికరమైన తీర్పులు వచ్చినా… జీవో నంబర్ 2430 విషయంలో మాత్రం ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వచ్చింది! ఇప్పుడు ఆ అస్త్రాన్ని ఆ రెండుపత్రికలపై ప్రయోగించింది ఏపీ ప్రభుత్వం!
ప్రభుత్వ విధానాలపై సరైన సమాచారం లేకుండా, నిరాధారంగా, వ్యక్తుల పరువుకు భంగం కలిగించేలా వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా సదరు మీడియా సంస్ధలకు నోటీసులు ఇవ్వడం.. వాటికీ స్పందించనిపక్షంలో.. చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేలా ప్రభుత్వం జీవో నంబర్ 2430ను తీసుకొచ్చింది. దీనిపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించడం తెలిసిందే. ఆ సంగతులు అలా ఉంటే… ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్, ఉషోదయా పబ్లికేషన్స్‌కు నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. మైనింగ్ పై అసత్య ఆరోపణలు చేసినవారిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందని.. ఆరోపణలు చేసిన ఆయా సంస్థలు, వ్యక్తులు 15 రోజుల్లో బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. అలాకానిపక్షంలో పరువునష్టం దావా వేస్తామని ద్విదేదీ స్పష్టం చేశారు. తప్పుడు కథనాలకు సంబంధించి ఆయా పత్రికలు స్పందించిన తీరు సంతృప్తికరంగా లేనందునే మీడియా ముందుకు వచ్చినట్టు ఆయన తెలిపారు.
దీంతో… ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆమోద పబ్లికేషన్స్ (ఆంధ్రజ్యోతి – రాధకృష్ణ), ఉషోదయా పబ్లికేషన్స్ (ఈనాడు – రామోజీరావు)లపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోందన్నమాట! మేము రాసిందే వార్త, అనుకున్నదే కథనం అంటూ ఇంతకాలం సాగిన కొన్ని పత్రికల, మీడియా ఛానళ్లకు ఇది శాంపుల్ మాత్రమేనని.. ఇప్పటికైనా మారని పక్షంలో.. ప్రజలకు తప్పుడు కథనాలు అందిస్తూ, ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు ఆపని పక్షంలో.. జీవో నంబరు 2430 ఉందని గుర్తుచేస్తున్నారు కొందరు ప్రభుత్వ పెద్దలు!!