
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కలకలం రేపుతుంది..! రాష్ట్రం ఎన్ని టెస్టులు చేస్తున్నా ఎన్ని కట్టుబాటు చర్యలు చేపడుతున్నా కోవిడ్ కేసులు మాత్రం తగ్గడం లేదు. టెస్టులు ఒక్కటే చేస్తే ఉపయోగం లేదు అని భావించిన ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో కరోనా పై అవగాహన కల్పించేందుకు ఏపీ సర్కార్ కంకణం కట్టుకుంది. ప్రజలలో కరోనా పట్ల అవగాహనను పెంచే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది. నిత్యం ప్రజలతో టచ్ లో ఉండేందుకు కరోనాతో ప్రజలు పోరాడేందుకు ప్రభుత్వం వారి పాకెట్ లో ఉండాలని నిశ్చయించుకుంది.
కరోనా పట్ల ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, వారికి సహాయంగా ప్రభుత్వం నిత్యం వారితో ఉండేందుకు ఓ యాప్ ను ప్రారంభించింది. COVID 19 AP యాప్ ను ఇంస్టాల్ చేసుకుంటే చాలు వారికి కరోనా గురించి ఎప్పటికప్పుడు సమాచారం వెళుతూనే ఉంటుంది. పైగా ఎవరైనా లక్షణాలతో బాధ పడుతుంటే వారు ఈ యాప్ ద్వారా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి ప్రభుత్వం తరఫున సేవలు పొందవచ్చు. కోవిడ్ నిర్ధారణ టెస్టులకు కూడా ఈ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. తమ డిటేల్స్ ఎంటర్ చేసి టెస్ట్ కోసం ఫోన్ లో అప్లై చేసుకుంటే చాలు వారికి టెస్ట్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ యాప్ ను ప్రతీ ఒక్కరూ ఇంస్టాల్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు సహాయపడాలని భావిస్తుందని ఏపీ సర్కార్ తెలియజేస్తుంది.