ఆంధ్రప్రదేశ్ లో నాబార్డు, ఎన్డీబీ సహకారంతో నిర్మించనున్న రహదారుల రివైజ్డ్ బిడ్డింగ్ లో మార్పులు చేస్తూ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇ-ప్రోక్యూర్ మెంట్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దాఖలు చేసిన ఇ-టెండర్ ప్రతులను చీఫ్ ఇంజనీర్ కు సమర్పించాల్సిన అవసరం లేకుండా వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలానే టెండర్ల దాఖలు కోసం చెల్లించాల్సిన బ్యాంకు గ్యారెంటీల విషయంలోనూ రహదారులు భవనాల శాఖ వెసులుబాటు కల్పించింది.
అంతేకాక విదేశాల్లోని జాతీయ బ్యాంకుల నుంచి లేదా జాతీయ బ్యాంకుల కౌంటర్ హామీతో విదేశీ బ్యాంకుల గ్యారెంటీలు చెల్లుబాటు అవుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ అంశాలను టెండర్ నిబంధనల్లో మార్పులు చేస్తూ రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు ఆదేశాలు ఇచ్చారు. గతంలో వేసిన బిడ్లు తక్కువ దాఖలు కావటంతో రహదారుల టెండర్లను ప్రభుత్వం రద్దు చేసిది. మొత్తం 6400 కోట్లతో 3 వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించాలని తాజాగా నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రీటెండర్లు పిలవాలని భావిస్తోంది