రాజధాని నిర్మాణాల విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ మేరకు నిధుల సమీకరణకు కసరత్తు ముమ్మరం చేసింది. నిర్మాణాలను కొనసాగించేందుకు.. అవసరమైన మేరకు నిధులను వెసులుబాటు కల్పిస్తూ 3000 కోట్ల రూపాయల మేర బ్యాంకు గ్యారెంటీని ఎమ్మార్డీఏకు ఇస్తూ కాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అధికారంలోకి వచ్చాక.. అమరావతి విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడం.. రాజధాని తరలింపు వ్యవహరం తెర మీదకు రావడంతో దాదాపు కట్టడాల నిర్మాణాలన్నీ నిలిచిపోయాయి.
దీంతో దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి రాజధాని అమరావతి పరిధిలో ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలు జరగలేదు. ఈ క్రమంలో శాసన రాజధానికి అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా సీఎస్ నేతృత్వంలో తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు చేసింది సర్కార్. ఆ కమిటీ తొలి భేటీలోనే అసంపూర్తిగా ఉన్న భవనాల నిర్మాణానికి మొత్తంగా 2154 కోట్ల రూపాయల మేర అవసరం అవుతాయని అంచనా వేసింది. అలాగే వీటితో పాటు.. కరకట్ట రోడ్ విస్తరణ, హ్యాపీనెస్ట్ భవనం నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం జరిగిన కెబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధానిలో అసంపూర్తి భవనాల నిర్మాణం కోసం అవసరమైన నిధులను సమీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించింది.