ఏపీలో నేటి నుంచి ఈ నెల 28 వరకు ఉచిత సరుకుల పంపిణీ జరగనుంది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోతున్న పేదలను ఆదుకునేందుకు సీఎం జగన్ ఆదేశాల మేరకు.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఇప్పటికే లబ్ధిదారులకు ఏడు సార్లు ఉచితంగా సరుకులు పంపిణీ చేసారు. తాజాగా 8వ విడతలో భాగంగా లబ్దిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం, కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
ఈ సందర్భంగా 1.49 కోట్ల కుటుంబాలకు పైగా లబ్ధి చేకూరనుంది. బియ్యంతో పాటు సబ్సిడీ సరుకుల కోసం రేషన్ డీలర్లు ఇప్పటికే డీడీల రూపంలో చెల్లించిన మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈసారి కూడా బయో మెట్రిక్ ద్వారా రేషన్ ఇస్తున్నారు. అంతేకాదు షాపుల దగ్గర శానిటైజర్లు ఏర్పాటు చేశారు. రేషన్ తీసుకునే ముందు ఆ తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి.