రోజూ మిమ్మల్ని చూడ్డానికే చికాకేస్తోంది.. అధికారులపై ఏపీ హైకోర్టు ఫైర్

-

కోర్టు ధిక్కరణ కేసుల్లో తరచూ న్యాయస్థానం మెట్లెక్కుతున్న ఉన్నతాధికారులపై ఏపీ హైకోర్టు తీవ్రంగా ఫైర్ అయింది. రోజూ మిమ్మల్ని చూడటానికి న్యాయస్థానానికే చికాకు పుడుతోందని మండిపడింది. తాజాగా ఓ కేసులో విచారణకు హాజరైన పంచాయతీరాజ్‌శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయశాఖ ప్రస్తుత ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్‌లను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ ఇద్దరు అధికారులే సుమారు 70 కోర్టు ధిక్కరణ వ్యాజ్యాల్లో న్యాయస్థానం ముందు హాజరయ్యారని గుర్తుచేసింది. ఏమిటీ పరిస్థితని విస్మయం వ్యక్తంచేసింది.

దేశంలోని మిగతా హైకోర్టులతో పోలిస్తే ఏపీ హైకోర్టులోనే ఎక్కువ సంఖ్యలో ధిక్కరణ కేసులు నమోదవుతున్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరు వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పడానికి సంకోచించడం లేదని తేల్చిచెప్పింది. అధికారులు కోర్టు ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేయడం లేదని తప్పుపట్టింది. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించాకే న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేస్తున్నారంటే.. అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేనితనమా.. లేక ఏమౌతుందిలే అనే బరితెగింపా.. అని తీవ్ర స్థాయిలో మండిపడింది.

Read more RELATED
Recommended to you

Latest news