ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగానే హైకోర్టు విభజన జరిగిందని పలువురు హైకోర్టు మాజీ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు. ఉమ్మడి హైకోర్టును త్వరగా విభజించాలని నాడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకి వెళ్లిన నేపథ్యంలో… తాము విభజనకు సిద్ధంగానే ఉన్నాము.. సొంతంగా భవనాలు ఏర్పాటు చేసుకుంటున్నామని డిసెంబర్ 15 నాటికి తరలివెళ్లిపోతామని సర్వోన్నతన్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేయడంతో, దాని ఆధారంగానే మరో 15 రోజులు గడువిచ్చి జనవరి ఒకటి నాటికి హైకోర్టు విడిపోవాలని సుప్రీం ఆదేశించిందని వారు వివరిస్తున్నారు. కోర్టులు మారినంత మాత్రాన కేసులు మొదటికొస్తాయని చెప్పడంలో అర్థం లేదని బార్ కౌన్సిల్ సభ్యులు, సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ తెలిపారు. దేశంలో ఇతర కోర్టుల ఏర్పాటు సమయంలో నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత కనీసం 30 నుండి 60 రోజుల గడువు ఇచ్చారని, ఆంధ్రప్రదేశ్ కోర్టుకు ఇవ్వకపోవడం కాస్త ఇబ్బంది కరంగానే ఉంటుందన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఎక్కడున్నా విచారణలు ఒకేలా ఉంటాయని, కోర్టు మారినంత మాత్రాన విచారణ మారుతుందని, తీర్పులు మారిపోతాయని చెప్పడం సరైంది కాదని అన్నారు. నేరం జరిగిందని చెబుతున్న స్థలం ఆధారంగా కేసులుంటాయని న్యాయవాదులు అంటున్నారు.
ఏపీ న్యాయవాదులు ఎవ్వరూ.. కోర్టు రాకూడదని కోరుకోవడం లేదని, తరలి వెళ్లేందుకు కొంత సమయం కావాలని మాత్రమే అడుగుతున్నారని పలువురు హైదరాబాద్‌లో స్థిరపడిన న్యాయవాదులు ఇక్కడకు రావడం, అక్కడ కుటుంబాలు ఉండటం, పిల్లల చదువులు తదితర విషయాలను దృష్టిలో పెట్టుకుని తరలి వెళ్లేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరుతు, ఇందులో న్యాయముందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా జనవరి నాటికి కోర్టు భవనాలు సిద్ధం చేస్తామని ప్రకటించిందని, ఇప్పుడు హడావిడి అనడం వెనుక అర్థం ఏమిటో తెలియడం లేదని రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మణ్‌రెడ్డి అన్నారు.