‘బిగ్‌బాస్‌’ షో.. నాగార్జున, మా టీవీ ఎండీకి హైకోర్టు నోటీసులు

-

‘బిగ్‌బాస్‌’ కార్యక్రమంపై దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు స్పందించింది. ఇది చాలా ముఖ్యమైన విషయమని, కేంద్రం దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో దాఖలు చేసిన వ్యాజ్యంలో కేంద్రం ఇప్పటి వరకు స్పందించకపోవడం సరికాదని పేర్కొంది.

బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా ఉన్న సినీనటుడు అక్కినేని నాగార్జున, స్టార్‌ మాటీవీ ఎండీ, ఎండెమోల్‌ ఇండియా డైరెక్టర్‌, సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌, ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ దుప్పల వెంకటరమణలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

బిగ్‌బాస్‌ షో హింస, అశ్లీలత, అసభ్యతలను ప్రోత్సహించేదిగా ఉందని పేర్కొంటూ నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ షోను ఆపేయాలని కోరారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. బిగ్‌బాస్‌ కార్యక్రమాన్నిసెన్సార్‌ చేయకుండా నేరుగా ప్రసారం చేస్తున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం ఇలాంటి షోలను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని తెలిపారు. అయినా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తోందని ఆరోపించారు. వాదనలు విన్న కోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news