మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల మాజీ అధికారి కేఎంవీ జగన్నాథరావుపై వేటు పడింది. ఆయణ్ను సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. భద్రత కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ముందస్తు అనుమతి లేకుండా లేని అధికారాన్ని వినియోగించి మునుగోడులో ఓ అభ్యర్థికి కేటాయించిన గుర్తును జగన్నాథరావు మార్చటం నాడు వివాదమైంది. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. విచారణ నిర్వహించి పంపిన నివేదిక మేరకు ఎన్నికల బాధ్యతల నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ను తప్పించి వెంటనే అప్పట్లో మరో అధికారిని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
‘‘తక్షణం ఆయన సస్పెన్షన్ అమలులోకి వస్తుంది. ఆ ఉత్తర్వులను జారీ చేసి శుక్రవారం ఉదయం 11 గంటలకల్లా దిల్లీ పంపాలి. ఎన్నికల అధికారికి తగినంత భద్రత కల్పించటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత డీఎస్పీని బాధ్యుడిని చేయండి. ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారో కూడా తెలియజేయాలి’’ అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు.