హెచ్ఎంపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన హైకోర్టు.. షాక్‌లో చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీ..

గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీకి హైకోర్టు షాకిచ్చింది. చిలకలూరిపేట శారదా హైస్కూలు ప్రధానోపాధ్యాయిని ధనలక్ష్మిపై ఉన్నతాధికారులు వేసిన సస్పెన్షన్ వేటును హైకోర్టు ఎత్తివేసింది. శారదా హైస్కూలు కమిటీ నియమాకంపై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదంలో జోక్యం చేసుకున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ.. కమిటీని రద్దు చేయాలని హెచ్ఎం ధనలక్ష్మిని ఆదేశించారు. దీంతో ఈ విషయాన్ని కమిటీ సభ్యులకు చెప్పిన ధనలక్ష్మి.. ఎమ్మెల్యేకు, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను వినిపించారు.

తన ఫోన్ కాల్‌ను రికార్డు చేసి కమిటీకి వినిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రజనీ.. విద్యాశాఖ ఉన్నతాధికారులకు హెచ్ఎంపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అక్టోబరులో ధనలక్ష్మిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఉన్నతాధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ హెచ్ఎం హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ధనలక్ష్మి సస్పెన్షన్ ఉత్తర్వులను ఎత్తివేసింది. కోర్టు తీర్పుతో ధనలక్ష్మికి ఊరట లభించగా, ఎమ్మెల్యే రజనీకి షాక్ తగిలినట్టు అయింది.