మంత్రి వెల్లంపల్లి మాటమీద నిలబడతారా?

-

రాజకీయాల్లో విమర్శలూ, ప్రతివిమర్శలూ అత్యంత సహజం! కాకపొతే కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలపై అధికారపక్షాలు కాస్త సీరియస్ గానే స్పందిస్తుంటాయి! ప్రభుత్వంపై అర్ధంపర్థం లేని విమర్శలు చేసే నేతలకు గట్టిగా వార్నింగులు కూడా ఇస్తుంటాయి! ఈ క్రమంలో వైకాపా మంత్రులు నిజంగా మాటమీద నిలబడతారా లేక రాజకీయ ప్రతివిమర్శలు మాత్రమే చేసి సైలంట్ అయిపోతారా అనే సంగతి తేలాల్సిన సందర్భం ఒకటి తాజాగా ఏపీ రాజకీయాల్లో జరిగింది!

వివరాల్లోకి వెళ్తే… టీటీడీ భూముల అమ్మకాలకు సంబందించి.. నాడు టీడీపీ ఇచ్చిన జీవోను రద్దు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది వైకాపా ప్రభుత్వం. దీంతో టీటీడీ భూముల అమ్మకాల నిర్ణయాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లే! దీంతో ఇది ముగిసిన అధ్యాయం కిందే లెక్క! అయితే ఈ విషయాలు ఏమీ పట్టకుండా కన్నా లక్ష్మీనారాయణ దీక్షకు దిగారు! హిందూమతానికి జగన్ అన్యాయం చేస్తున్నారంటూ ఉపన్యాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు! దీంతో ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ స్పందిస్తూ… కన్నా ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నారో చెప్పాలని.. గత పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని రద్దుచేసినందుకు నిరాహార దీక్ష చేస్తున్నారా..? అని ప్రశ్నిస్తూ… నూజివీడులో వెంకటాచలం భూములు 18 ఎకరాలు కబ్జా గురించి కొద్దీ రోజుల్లో బయట పెడతాం అని ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నందుకు మంత్రి ఇలా కన్నాపై ప్రతివిమర్శ చేశారా? లేక నిజంగానే నూజివీడు వెంకటాచలం భూముల కబ్జా విషయంలో కన్నా హస్తం ఉందా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ విషయంలో కన్నా విమర్శలు చేశారని కాదు కానీ… నిజంగా వెంకటాచలం భూముల విషయంలో కబ్జాలు జరిగి ఉంటే మాత్రం ప్రభుత్వం కచ్చితంగా స్పందించాలని… వైకాపా ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని ఈ విషయంలో కూడా నిరూపించుకోవాలని పలువురు సూచిస్తున్నారు!

అలాకానిపక్షంలో… ప్రభుత్వంపై విమర్శలుచేసే ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఇలా బ్లాక్ మెయిల్ చేసే కార్యక్రమాలకు తెరతీస్తుందని ప్రజలు భావించాల్సి వస్తుందనేది మరికొందరి అభిప్రాయం! ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని… నూజివీడు వెంకటాచలం భూములకు సంబందించిన వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వం ప్రజలకు వీలైనంత తొందర్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది!! మరి ఏపీ మంత్రి వెల్లంపల్లి మాటమీద నిలబడతారా? ఆ వెంకటాచలం భూముల కబ్జా వ్యవహారం బయటపెడతారా అన్నది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news