ఏపీ రాజకీయాల్లో గత కొంతకాలంగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. అసలు ఎందుకీ దుమారం.. ఈ గొడవకు కారణమేంటి..
సింహాచలం ఆలయ ట్రస్ట్, మన్సాస్ ట్రస్ట్లకు శాశ్వత ధర్మకర్తలుగా విజయనగరం గజపతిరాజులు కుటుంబం ఉంటోంది. మొన్నటి వరకూ టీాడీపీ నేత అశోక్ గజపతి రాజు ఈ పదవిలో కొనసాగారు. అయితే అశోక్ గజపతిరాజును తొలగించి బీజేపీ నేత ఆనందగజపతి రాజు కుమార్తె సంచయితను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడే అసలు దుమారం మొదలైంది. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు లేనిపోని రాద్దాంతాలు చేస్తున్నారు. ఓ మహిళలకు ఇలాంటి బాధ్యతలను అప్పగించడం సహించలేని టీడీపీ నేతలు ఆమెపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆమె అసలు హిందూవే కాదని, ఓ క్రైస్తవురాలికి ఇలాంటి పదవి ఎలా అప్పగిస్తారంటూ నానా యాగి చేసేశారు. టీడీపీ తో పాటు పలువురు ఏపీ బీజేపీ నేతలు సైతం వారితో గొంతు కలిపారు. సంచయిత నియామకం ట్రస్ట్ నిబంధనలకు విరుద్దమని ఏపీ ప్రభుత్వంపై ఈ రెండు పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ టీడీపీ నేతలు సంచయిత పై పెద్ద ఎత్తున రాజకీయాలు చేస్తుండటంతో ఆమె కూడా దీనిపై తీవ్రంగానే స్పందించారు. తాను కూడా హిందువునేనని అయినా టీడీపీ నేతలు తనపై ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. తాను హిందువుని కాదని తన బాబాయ్ చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వాటికన్ కు వెళ్ళి ఫోటోలు దిగినంత మాత్రాన తాను క్రిస్టియన్ ని అయిపోతానా అని ప్రశ్నించారు. మీరెప్పుడు మసీదులు, గురుద్వారాలకు, చర్చిలకు వెళ్ళలేదా అని నిలదీశారు.