ఇంజనీరింగ్ చదువుతున్నారు. యువతులుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తోటి మహిళల ఇబ్బందులను అర్థం చేసుకున్నారు. రుతుస్రావం విషయంలో పేద మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకున్నారు. అందుకే పీరియడ్స్ సమయంలో వాడే నాప్కిన్లను శుభ్రపరిచే యంత్రాన్ని కనుగొన్నారు ఈ యువతులు..
ఐశ్వర్య అగర్వాల్ ముంబై ఐఐటీలో, దేవయాని మల్దాకర్ గోవా ఐఐటీలో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరిది మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా తమలాంటి తోటి మహిళలను వేధిస్తున్న నాప్‌కిన్ల సమస్యకు పరిష్కారం చూపాలనుకున్నారు. వ్యక్తిగతంగా, ఇతర మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల వాళ్లు ఆవేదనకు గురయ్యారు. దేశంలో చాలామంది అమ్మాయిలు శుభ్రతలేని న్యాప్‌కిన్లను వాడి చనిపోతున్నారనే విషయం వీళ్లను ఆలోచింపజేసింది. అందుకే సానిటరీ న్యాప్‌కిన్ల శుభ్రం చేసే డివైజ్‌ను ఆవిష్కరించారు.
2019 మే లో ఇన్‌వెంట్ అనే ప్రాజెక్ట్ ద్వారా పునర్వినియోగించే సానిటరీ నాప్‌కిన్ల కోసం డివైజ్‌ను తయారు చేయడం ప్రారంభించారు. వాడిన నాప్‌కిన్లను వృథా చేయకుండా వాటిని శుభ్రం చేసి అందించే యంత్రాన్ని ఆవిష్కరించారు. దీని కోసం ప్రత్యేక అధ్యయనం చేశారు.
దేశంలో చాలామంది అమ్మాయిలు, మహిళలకు శుభ్రమైన నాప్‌కిన్లే తెలియవనీ, అపరిశుభ్రమైన వాటిని వాడుతున్నారని తెలుసుకున్నారు. ఇలా అపరిశుభ్ర నాప్‌కిన్లు వాడడం వల్ల వచ్చే టాక్సిక్ షాక్ సిండ్రోమ్‌కు గురై చనిపోతున్నారని తెలుసుకున్నారు. ఒకసారి వాడి పాడేసిన నాప్‌కిన్ భూమిలో కలిసిపోవడానికి 500-800 ఏండ్లు పడుతుంది. ఇలాంటి వాటికి పరిష్కారంగానే ఈ ఆలోచన వచ్చిందని ఐశ్వర్య అంటున్నది. కరంట్‌తో కాకుండా ఫూట్ పెడల్స్‌తో.. ఈ డివైజ్ పని చేస్తుంది. ఇందులోని వాటర్ రూంలో నాప్‌కిన్ పెడితే.. మరకలు తొలగించే దశ ప్రారంభం అవుతుంది. నీటిని మొత్తం పీల్చేసి శుభ్రపరిచి తిరిగి నాప్‌కిన్‌ను అందిస్తుంది అని దేవయాని చెప్తున్నది. ఈ ఆవిష్కరణ కేవలం ఇంజినీరింగ్ అంశం కాదని, ఇది సమాజాన్ని ప్రభావితం చేసే అవిష్కరణ అని ఈ విద్యార్థులు అంటున్నారు.