ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గి కోస్తాంధ్ర మీదుగా పరిసర ప్రాంతాలపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దసరా రోజున కురిసిన వర్షంతో ఏపీ అతలాకుతలమైంది. బాపట్ల జిల్లా రేపల్లె తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురిసింది. భారీ వర్షానికి రేపల్లె పట్టణంలోని ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. బస్టాండ్ సెంటర్, తాలూకా సెంటర్, మున్సిపాల్టీ కార్యాలయం రోడ్లు.. నీట మునిగిపోయాయి.
పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్ష ప్రభావంతో పలుచోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పత్తి, మిర్చి పంటలు పూత దశకు వచ్చిన సమయంలో కురుస్తున్న వర్షంఅన్నదాతలు ఆందోళన రేపుతోంది.