తిరుపతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉమ్మడి ఏపీ ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో వైఎస్ విజయమ్మ ‘నాలో నాతో వైఎస్సార్’అనే పుస్తకాన్ని విడుదల చేశారు. వైఎస్ పాదయాత్రలో జగన్ ఉన్నారని ఈ పుస్తకంలో ఆమె పేర్కొన్నారు.
అయితే ఈ పుస్తకం అవాస్తవాల పుట్ట అంటూ గోనె ప్రకాశ్ కొట్టిపారేశారు. వైఎస్ పాదయాత్ర చేసిన సమయంలో జగన్ లేరన్నారు. ఒక్క రోజు కూడా వైఎస్ పాదయాత్రలో జగన్ పాల్గొనేలేదని గోనె ఆరోపించారు. ఆ విషయం అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్‌కి బాగా తెలుసని చెప్పారు. నిరూపిస్తే తాను ఉరివేసుకుంటానని చెప్పారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ ఇలాంటి అవాస్తలు ప్రచారం చేయడం తగదని సూచించారు.
ఇక తెలంగాణలో షర్మిల పార్టీపై కూడా గోనె ప్రకాశ్ స్పందించారు. షర్మిలకు తెలంగాణ ప్రజల ఆదారణ ఉండదని చెప్పారు. ఏపీలో అన్యాయం జరిగితే తెలంగాణలో పార్టీ పెట్టడమేంటని ప్రశ్నించారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీ పెడితే మద్దతివ్వడమేంటని వ్యాఖ్యానించారు. షర్మిలకు విజయమ్మ షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాలనలో వైఎస్ జగన్, కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. జగన్ బెయిల్ రద్దు కాయమన్నారు. బీజేపీ తల్చుకుంటే కేసీఆర్, జగన్ జైలుకు వెళ్లడం తధ్యమని గోనె ప్రకాశ్ పేర్కొన్నారు.