ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా విచిత్రంగా సాగుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత మూడు రాజధానుల విషయంలో ఒక రకమైన పాట పాడుతుంటే… అధినేత అభిప్రాయంతో ఏమాత్రం సంబందం లేకుండా.. ఆ పార్టీలోని నేతలు మాత్రం మూడు రాజధానులకు సై అంటున్నారు!
అవును… విశాఖపట్టణం టీడీపీలోని మాజీ నేతలు మూడు రాజధానులకు సై అంటున్నారు. సిట్టింగ్ లు సైలెంటైపోయి పార్టీలో వైలెంట్ సృష్టిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్టణం జిల్లా రాజకీయాల్లో మూడు రాజధానుల విషయం ఓ కుదుపు కుదుపుతుంది. విశాఖలోని నాలుగు కీలకమైన స్ధానాలను టీడీపీ గెలుచుకొని ప్రతిపక్షంగా బలంగా ఉంది. ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాస్‌రావు, మిగిలిన మూడు స్థానాల్లోనూ సీనియర్ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్ కొనసాగుతున్నారు. మొన్నటి వరకూ అధికారపార్టీతో ఢీ అంటే ఢీ అన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు అధినేత వింతపోకడలు చూసో ఏమోగానీ… డైలమాలో పడ్డారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూపిస్తూ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై అధికార పార్టీ చాలా వేగంగా అడుగులు వేస్తోంది. ఇదే సమయంలో టీడీపీ మాత్రం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని తీవ్రమైన కృషి “జూమ్” ద్వారా చేస్తుంది.. మరోపక్క రాజధాని రైతులు పోరాటాలు చేస్తున్నారు. ఇదే సమయంలో అధిష్టానం నిర్ణయాన్ని సమర్ధిస్తూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడు అనిత వంటివారు ప్రకటలు చేస్తున్నారు. వారి సంగతి అలా ఉంటే… సిటింగ్ ఎమ్మెల్యేలు మాత్రం ఏమాత్రం నోరు మెదపట్లేదు. సున్నితమైన రాజధాని వ్యవహారంలోకి దూరితే ఇబ్బంది పడక తప్పదని బెంబేలెత్తిపోతున్నారు. ఇదే అయోమయంలో అంతా ఎవరి ఫోన్లు వాళ్లు సైలంట్ లో పెట్టేసి అందుబాటులో ఉండటం లేదంట.
ఇదే సమయంలో వైజాగ్ లోని కీలక టీడీపీ నేతలు మూడు రాజధానులపై ఒప్పుకోక తప్పని పరిస్థితిని వైసీపీ సృష్టించింది. ఇప్పుడున్న ఈ సమయంలో మూడు రాజధానులకు ఒక్కొక్కటిగా అన్ని అడ్డంకులు తొలగిపోతుండటంతో.. టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిని వారితోనే బయట పెట్టించేందుకు వైసీపీ తీవ్రంగా యత్నిస్తోంది. అందులో భాగంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలతో తమ విధానం స్పష్టంగా చెప్పాలని… లేకపోతే రాజీనామాలు చేసి రెఫరెండానికి రావాలని సవాళ్లు విసురుతోంది వైసీపీ.
కాగా గంటా శ్రీనివాస్ రావు త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారని టాక్. మరి మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. రాజధాని వికేంద్రీకరణకు గవర్నర్ ఆమోదముద్ర పడగానే టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్తూ… సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అలాగే… మిగతా ఇద్దరూ వెలగపూడి, గణబాబులు మాత్రం కాస్త దూరం మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ ఉత్తరాంధ్ర సెంటిమెంట్ వేడిని రగిలిస్తే మాత్రం.. టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిర్ణయం ప్రకటించక తప్పని పరిస్ధితి ఏర్పడినట్లే. మరి మిగతా ఇద్దరూ ఎలాంటి వైఖరిని అవలంభిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.