చంద్రబాబుకు, బోండా ఉమకు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇటీవల విజయవాడ అత్యాచార బాధితురాలిని పరామర్శించే సమయంలో చంద్రబాబుకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబును స్వయంగా కమిషన్ ముందు ఈరోజు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. దీనికి నిరసనగా టీడీపీ మహిళలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. చంద్రబాబుకు వాసిరెడ్డి పద్మ నోటీసులు ఇవ్వడం ఏనుగులు వెళ్తే కుక్కలు మొరిగినట్లు ఉందని ఎద్దేవా చేశారు. వాసిరెడ్డి పద్మ స్థాయేంటని.. చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులు చెత్త కాగితంతో సమానం అని విమర్శించారు. చంద్రబాబుతో వాదనలు పెట్టుకుంటే జగన్ మోహన్ రెడ్డి దగ్గర మార్కులు పడుతాయని… చంద్రబాబుతో వాదనలు పెట్టుకుంటే ఏదో పెద్ద నాయకురాలిని అవుతానని ఊహించుకుంటున్నారని విమర్శించారు. మీ స్థాయికి తగ్గట్లు ప్రవర్తించాలని.. మీరేంటి మీ స్థాయి ఏంటని, మీలాంటి చైర్మన్లు చంద్రబాబు దగ్గర పది మంది పనిచేశారని బుద్ధా వెంకన్న అన్నారు.
చంద్రబాబుకు వాసిరెడ్డి పద్మ నోటీసులు… ఏనుగులు వెళ్తే కుక్కలు మొరిగినట్లు ఉంది: బుద్ధా వెంకన్న
-