దసరా పండుగకు రెండు తెలుగురాష్ట్రాల మధ్య అంతర్‌రాష్ట్ర సర్వీసులు లేనట్టే. తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ అధికారుల చర్చలు కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు లక్షా 60 వేల కిలోమీటర్లే బస్సులు తిప్పేందుకు ఏపీఎస్ ఆర్టీసీ అంగీకరించింది. రూట్ మ్యాప్ తయారుచేసి టీఎస్ఆర్టీసీకి అందించింది. హైదరాబాద్ – విజయవాడ రూట్ పైనే సందిగ్థత నెలకొంది. దీంతో సొంత ఊర్లకు వెళ్దామనుకున్నవారు ప్రైవేట్ ట్రావెల్స్‌ను ఆశ్రయించక తప్పని పరిస్థితి.
అయితే ఏపీ, తెలంగాణ మధ్య అవహగాహన కుదరకపోవడంతో ఆర్టీసీ బస్సులను రాష్ట్రాల సరిహద్దుల నుంచి తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు. జగ్గయ్య పేట మండలం గరికపాడు వరకు ఏపీ బస్సులు వెళ్తున్నాయి. ఆర్టీసీ అధికారుల అవగాహన లోపం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడంలేదు. ఏపీ మంత్రి విజ్ఞప్తి మేరకు తెలంగాణా కూడా బస్సులను సరిహద్దుల దాకా నడుపుతోంది. అయితే సరిహద్దుల మధ్య 2కిలోమీటర్లు ఆటో, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. రెండు కిలోమీటర్ల దూరానికే ప్రయాణికుల నుంచి 50రూపాయల వరకు వసూలు చేస్తున్నారు ప్రైవేట్ వాహనదారులు. పండుగ సీజన్‌లో అందినకాడికి దండుకుంటున్నారు.