భారతదేశంలోనే ఉపాధిహామీ పనులు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానాన్ని పొందిందని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలియజేశారు. నేడు ఆయన మీడియా తో మాట్లాడుతూ… గడిచిన 14 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పనులు కల్పించామని, ఎంత కష్టమైనా సరే కరోనా కష్టకాలంలో అనేక మందికి ఉపాధి కల్పించామని ఆయన తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన టార్గెట్ అనుగుణంగా రాష్ట్రంలో లక్షల మంది కూలీలకు పని కల్పించామని తెలియజేశారు.
కరోనా సమయంలో పని కల్పించడం ద్వారా రూ. 4000 కోట్ల వేతనాలను కార్మికులకు అందించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలు, నాడు-నేడు పాఠశాల పనులు, గ్రామ సచివాలయాలు నిర్మాణం లాంటి పనులు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యధికంగా ఆస్తుల నిర్మాణంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని, అంతేకాకుండా పారదర్శకంగా వేతనాలు చెల్లించడంలో అందరికంటే రాష్ట్ర సర్కారు ముందంజలో ఉందని ఆయన తెలియజేశారు.