ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కు చెందిన జాబ్ అప్లికేషన్ కు మళ్లీ వేలం నిర్వహించనున్నారు. గతంలో 2018లో అదే అప్లికేషన్ కు వేలం నిర్వహించగా ఏకంగా 1.75 లక్షల డాలర్ల ధర పలికింది. ఈ క్రమంలోనే తాజాగా మళ్లీ వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు.
స్టీవ్ జాబ్స్ 1976లో యాపిల్ సంస్థను ఏర్పాటు చేయగా అంతకన్నా ముందే.. అంటే.. 1973లో ఆ జాబ్ అప్లికేషన్ రాశారు. అందులో చాలా వరకు వాక్యాలను టైప్ చేసినట్లు స్పష్టమవుతుంది. మధ్యలో ఉండే ఖాళీలను స్టీవ్ జాబ్స్ పూర్తి చేశారు. అయితే ఆ జాబ్ అప్లికేషన్ కేవలం ఒకే పేజీలో మాత్రమే ఉండగా.. ఆయన అప్పుడు ఏ కంపెనీకి ఆ అప్లికేషన్ పెట్టారు ? ఏం జాబ్ కోసం అప్లై చేశారు ? అన్న వివరాలు ఆ అప్లికేషన్‌లో లేవు. కానీ ఆయన తన స్కిల్స్ ను అందులో పేర్కొనడం విశేషం.
తాను రీడ్ కాలేజ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్ విద్యార్థిని అని, కంప్యూటర్, కాలిక్యులేటర్, డిజైన్, టెక్నాలజీస్ తన స్కిల్స్ అని స్టీవ్ జాబ్స్ ఆ అప్లికేషన్ లో తెలిపారు. అంటే.. అప్పట్లో ఏదైనా టెక్నాలజీ కంపెనీకి జాబ్ కోసం ఆయన అప్లై చేసి ఉంటారు.. అనే విషయం సదరు అప్లికేషన్‌ను చూస్తే తెలుస్తుంది. అయితే ఆ అప్లికేషన్ ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషం. ఈ క్రమంలోనే దానికి రెండో సారి వేలం నిర్వహించనున్నారు.
ఈ నెల 24 నుంచి మార్చి 24వ తేదీ వరకు నెల రోజుల పాటు bidspotter.co.uk అనే సైట్‌లో స్టీవ్ జాబ్స్ జాబ్ అప్లికేషన్‌కు వేలం ఉంటుంది. వేలంలో అత్యధిక ధర ఇచ్చే వారికి ఆ డాక్యుమెంట్‌ను అందజేస్తారు. మరి ఈ సారి ఆ జాబ్ అప్లికేషన్‌కు ఎంత ధర వస్తుందో చూడాలి.