వీనుల విందైన స్వరాలను అందించడంలోనే కాదు, అవసరం వస్తే తోటి వారికి సహాయం చేసేందుకు కూడా తాను సిద్ధమేనని మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ నిరూపించుకున్నాడు. భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన కేరళను ఆదుకునేందుకు రెహమాన్ భారీ విరాళం అందించారు. ఈ విషయాన్ని రెహమాన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. తమ బృందంతో కలసి రూ.1 కోటిని కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
నిన్న రెహమాన్ తన బృందంతో కలిసి అమెరికాలో మ్యూజిక్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తాను కేరళకు సాయం అందిస్తున్న విషయాన్ని రెహమాన్ అదే షో వేదికపై ప్రకటించారు. నేను, నా ఆర్టిస్టులు కలసి అమెరికా టూర్‌లో పాల్గొన్నాం. కేరళ వాసుల కోసం మా వంతు సహాయం చేశాం. ఈ చిన్న విరాళం మీకు కాస్త ఊరటనిస్తుందని ఆశిస్తున్నాం.. అంటూ రెహమాన్ ట్వీట్ చేశారు.
కాగా మ్యూజిక్ షోలో భాగంగా రెహమాన్ కేరళ బాధితులను ఉద్దేశించి పాట కూడా పాడారు. కేరళ, కేరళ, డోన్ట్ వర్రీ కేరళ అంటూ ఆ రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెబుతూ రెహమాన్ పాడిన పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఇక రెహమాన్ తన టూర్‌ను పూర్తి చేసుకుని ఈ నెల చివర్లో తిరిగి భారత్‌కు రానున్నారు. తరువాత రెహమాన్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న నవాబ్ సినిమాకు గాను ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిసింది. కాగా ఈ సినిమాకు గాను నిర్వహించనున్న ఆడియో వేడుకలో రెహమాన్ ఓ ప్రదర్శన కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.