శబరిమల భక్తులకు బ్యాడ్‌న్యూస్. ఆలయంలో పవిత్ర ‘అరవణ ప్రసాదం’ విక్రయాలు నిలిచిపోయాయి. ఈ ప్రసాదం తయారీ, అమ్మకాలను వెంటనే నిలిపివేయాలని కేరళ హైకోర్టు బుధవారం ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. దీనిలో ఉపయోగించే యాలకుల్లో పరిమితికి మించి రసాయనాలు వినియోగించారన్న నివేదిక ఆధారంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని లేకుండా తయారు చేసిన ప్రసాదం విక్రయించుకోవచ్చని న్యాయస్థానం సూచించింది.
అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకులను ట్రావెన్‌కోర్ బోర్డు అంతకుముందు అయ్యప్ప స్పైసెస్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. అయితే, 2022-23 సీజన్‌లో ఈ యాలకుల కాంట్రాక్టును కొల్లాంకు చెందిన ఓ సప్లయర్‌కు బోర్డు అక్రమంగా అప్పగించిందని అయ్యప్ప స్పైసెస్ కంపెనీ ఆరోపించింది.
ఈ క్రమంలోనే యాలకుల నాణ్యతపై ఈ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లాబొరేటరీలో పరీక్షించారు. ఈ యాలకులు అసురక్షితమైనవిగా తేలాయి. కొల్లాం కంపెనీ సప్లయ్ చేసిన వాటిల్లో 14 రకాల రసాయనాలు మోతాదుకు మించి ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎఫ్ఎస్ఎస్ఏ నివేదిక ఆధారంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.