గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ప్రధాన పార్టీలు ప్రచారం మరింత ముమ్మరం చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆప్ ఎలాగైనా గుజరాత్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఇవాళ తమ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్నారు ఆప్ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. రాష్ట్ర ప్రజలు పార్టీకి సమర్పించిన అభిప్రాయాల ఆధారంగా అభ్యర్థి పేరును కేజ్రీవాల్ వెల్లడించనున్నారు. ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా, జాతీయ కార్యదర్శి సుదాన్ గద్వీ, జనరల్ సెక్రటరీ మనోజ్ సొరాతియాలు సీఎం అభ్యర్థి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవాళ అహ్మదాబాద్లో ఆమ్ ఆద్మీ చీఫ్ కేజ్రీవాల్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం అభ్యర్థిపై ఆయన ప్రకటన చేయనున్నారు. ఎస్ఎంఎస్, వాట్సాప్, వాయిస్ మెయిల్, ఈ మెయిల్ ద్వారా సీఎం అభ్యర్తిపై అభిప్రాయాలు వెల్లడించాలని కేజ్రీవాల్ గుజరాత్ ప్రజల్ని కోరిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1, 5 తేదీల్లో గుజరాత్ పోలింగ్జరగనుంది.