మీ ప్రాంతంలో రైతులు పత్తికట్టె కాల్చేస్తున్నారా? మరీ అక్కడ వాళ్లు ఏం చేస్తారో తెలుసా..!

-

ఈ భూమ్మీద వ్యర్థంగా ఏదీ ఉండదూ..దాని జీవం అయిపోయిన తర్వాత కూడా ఏదోఒక విధంగా ఉపయోగపడుతుంది.. రైతులు పండించే వాటిల్లో కూరగాయలతో పాటు పత్తి ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా వేలాది ఎకరాల్లో పత్తిసాగు చేస్తుంటారు. అయితే పత్తి పండటం పూర్తైన తర్వాత ఆ కట్టెను రైతులు పొలాల్లోనే తగలేస్తుంటారు. కానీ పత్తి కట్టెతో బోలెడు లాభాలున్నాయట. పక్క రాష్ట్రాల్లో పత్తికట్టెను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారట అక్కడి రైతులు.

పంట చేనులో పత్తి కట్టెను తగులబెట్టడంతో భూములు సారం దెబ్బతింటుంది. భూమిలో ఉండే మిత్ర పురుగులు, సూక్ష్మజీవులకు హాని కలుగుతుంది. అంతేకాకుండా కట్టెను కాల్చే సమయంలో వచ్చే పొగ కారణంగా పర్యావరణానికి ముప్పు కలుగుతున్నది. అలాగే, భూమిలో కలియదున్నడంతో చీడపీడలు చేనులోనే ఉండిపోతాయి. కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం పత్తి కట్టెను ప్యాకింగ్‌ మెటీరియల్‌, సేంద్రియ ఎరువుల తయారీలో వినియోగిస్తున్నారు. దీని ద్వారా రైతులకు శ్రమ తగ్గడమే కాకుండా అదనపు ఆదాయం కూడా వస్తుంది.

పత్తికట్టెను ఇంతలా వాడేస్తున్నారా?

మహారాష్ట్రలో ఎండిన పత్తి కట్టెతో పార్టికల్‌ బోర్డులు, హార్డ్‌ బోర్డులు, కర్రుగేటెడ్‌ బోర్డులు, బాక్సులు, పేపర్‌ పల్ప్‌, ప్యాకింగ్‌ బాక్సులు ప్లైవుడ్‌ తయారు చేస్తున్నారు. తినదగిన పుట్టగొడుగుల పెంపులో మైక్రో క్రిస్టలిన్‌ సెల్యులోజ్‌ కోసం కూడా ఈ పత్తికర్రను వినియోగిస్తున్నారు. ఫ్యాక్టరీల యజమానులు తొలగించిన పత్తికట్టెను టన్నుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారట

సాధారణంగా హెక్టారు పత్తి చేనులో 4 టన్నుల పత్తి కర్ర లభ్యమవుతుందని ప్రాధమిక అంచనా. ఒక పత్తికర్రలో 68 శాతం హోలో సెల్యులోజ్‌, 26 శాతం లిగ్నిన్‌, 7 శాతం బూడిద లభ్యమవుతుందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘కేంద్ర పత్తి సాంకేతిక పరిశోధన సంస్థ (సిర్‌కాట్‌–సీఐఆర్‌సీఈవోటీ)’ లెక్క కట్టింది. ఈ లెక్కన కట్టె అమ్మకం ద్వారా ప్రతీ రైతుకు హెక్టారుకు రూ. 1,200 నుంచి 1,600 ఆదాయం వస్తుంది.

పత్తికట్టెను ఎలా వాడొచ్చు

ఎండి పత్తి కట్టెను పొడి చేసి వర్మీ కంపోస్ట్‌ తయారీలో వినియోగించవచ్చు.
పశువులకు దాణాగా కూడా వాడవచ్చు.
పొడి చేసి చేనులో చల్లితే బయోమార్చ్‌గా మారి తేమను నిలిపిఉంచే సామర్థ్యం పెరుగుతుంది.
కలుపు మొక్కలు పెరుగకుండా కూడా అరికడుతుంది.
పత్తికట్టెతో పిడకలు తయారుచేసి ఫ్యాక్టరీల్లో, బాయిలర్లలో బొగ్గుకు బదులుగా వాడవచ్చు.
ప్యాకింగ్‌ మెటీరియల్‌ తయారీలో, ఫ్లైవుడ్‌ తయారీ, పేపర్‌ తయారీలోనూ పత్తికర్రలను వాడవచ్చు.
పుట్టగొడుగుల సాగులో ఎరువుగానూ వాడుతుంటారు.

ఇలాంటి పరిశ్రమలను పక్కరాష్ట్రాలతో పాటు మన దగ్గర కూడా ఏర్పాటు చేస్తే..అటు రైతులకు ఇటు యువతకు మేలు చేకూరూతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీరేం అంటారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news