రాష్ట్రంలోని రాజకీయాలు కొత్త పుంతలు తొక్కడంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పబ్లిక్‌గా గొడవ పడటంపై తోటి రాజకీయ నేతలు సైతం విస్మయం చెందుతున్నారు. అధికారం కోల్పోయిన గులాబీ పార్టీ మైలేజ్ కోసమే ఇలాంటి స్టంట్స్ చేస్తోందని అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తుంటే.. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలను ఎదిరిస్తున్నామని చెప్పుకుంటోంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య జరిగిన గొడవపై కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తాజాగా స్పందించారు. మీరు అసలు ఎమ్మెల్యేలా?..వీధి రౌడీలా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో గతంలో బీఆర్ఎస్ చేసిన పనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోందన్నారు.కౌశిక్‌రెడ్డి కూడా పార్టీ మారిన వాడే కదా..అని గుర్తుచేశారు. పార్టీ మారిన వెంటనే ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడితేనే భవిష్యత్తులో ఇలాంటి ఫిరాయింపులు ఆగిపోతాయని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు పదవికి రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.