ఆరోగ్యానికి మంచిదని మజ్జిగను అతిగా తాగేస్తున్నారా..?

-

పెరుగు కంటే.. మజ్జిగా ఇంకా చాలా మంచిది. రోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే.. శరీరం చల్లగా ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా దీని ప్రస్తావన ఉంది. అయితే ఏదైనా సరే..మితంగా తింటేనే ఆరోగ్యం. అమితంగా తింటే మాత్రం ఏదో ఒక సైడ్ ఎఫెక్టులు వస్తాయి. అలాగే మజ్జిగ కూడా అతిగా తాగితే కొన్ని రకాల సమస్యలు వస్తాయి. వీటిపై చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. ఇలాంటి సమస్యలు వచ్చినా అవి మజ్జిగ వల్ల అని అనుకోరు. కాబట్టి అతిగా మజ్జిగ తాగితే వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పాలతో చేసిన ఏ పదార్థాల్లో అయినా లాక్టోజ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది అందరికీ అరగదు. దీన్ని అరిగించుకునే శక్తి పేగుల్లో విడుదలయ్యే ఎంజైమ్‌ల పైనే ఆధారపడి ఉంటుంది. కొందరికి ఈ లాక్టోజ్‌ను అరిగించే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి కాదు. అలాంటప్పుడు అధికంగా మజ్జిగ, పాల పదార్థాలు తినడం వల్ల కడుపునొప్పి, అజీర్తి, విరేచనాలు కలుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉంటుంది. కాబట్టి మజ్జిగను అధికంగా తాగవద్దు. అయితే ఎవరిలో ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ సమస్య ఉంటుందో కనిపెట్టడం కష్టం. అలాగే కొందరికి పాలలో ఉండే ప్రోటీన్లు కూడా పడవు. పాలలో ఉండే ప్రోటీన్లే మజ్జిగలో కూడా ఉంటాయి కదా. మజ్జిగ అధికంగా తాగడం వల్ల కొందరికి చర్మంపై దద్దుర్లు రావచ్చు. కాబట్టి రోజుకు ఒక గ్లాసుకి మించి తాగకపోవడం ఉత్తమం. మజ్జిగ తాగడం వల్ల మన శరీరానికి అందే క్యాలరీలు తక్కువే. అందుకే ఎక్కువ మంది మజ్జిగను తాగేందుకు ఇష్టపడతారు.

క్యాలరీలు లేవు కదా అని అధికంగా తాగితే మాత్రం జలుబు వంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే మజ్జిగ చలువ పదార్థం. కొంతమంది ఈ మజ్జిగలో చక్కెర వేసుకొని తాగుతూ ఉంటారు. దీనివల్ల ఆరోగ్యానికి నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదు. చక్కెర లేకుండా సాధారణ మజ్జిగను తాగడమే ఆరోగ్యకరం. అలాగే ఉప్పును కూడా అధికంగా వేసుకోకూడదు. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటివి వేసి ఒక గంట సేపు వాటిని నానబెట్టి తర్వాత వడకట్టి ఆ మజ్జిగను తాగితే చాలా రుచిగా ఉంటుంది.

వేసవికాలంలో మజ్జిగను తాగితే ఆరోగ్యకరం. కానీ వానాకాలం, శీతాకాలంలో రోజూ మజ్జిగను గ్లాసుల కొద్ది తాగడం మాత్రం అస్సలు అలవాటు చేసుకోవద్దు. వేసవిలో రోజుకి రెండు గ్లాసుల మజ్జిగ తాగవచ్చు. కానీ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చిన్న గ్లాసు మజ్జిగతోనే ఆపేయాలి. లేకుంటే త్వరగా ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news