చాదార్ ఘాట్ వద్ద మూసి పరివాహక ప్రాంతాలలో పది అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. పూర్తిగా నీట మునిగిన మూసానగర్, శంకర్ నగర్, కమల్ నగర్ ప్రాంతాలలో ఇళ్ళల్లోకి నీరు చేరటంతో పైకప్పు ఎక్కారు ప్రజలు. వారంతా సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. చాదర్ ఘాట్ కొత్త వంతెనపైకి కూడా నీరు ప్రవహిస్తోంది. కోఠి, దిల్ షుఖ్ నగర్ కు పూర్తిగా రాకపోకలు స్థంబించాయి. దీంతో మరి కాసేపట్లో ఆయా ప్రాంతాలకి ఆర్మీ, ఎండిఆర్ ఎఫ్, చాపర్స్ చేరుకోనున్నాయి.
ఇక భారీ వర్షాల వలన ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచనలు చేశారు. ఇప్పటికే అధికారులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు చేపడుతున్నారని, ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన అన్ని సహాయక చర్యలను చేపడతామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రోడ్ల మీద ఉండేవారిని వెంటనే జిహెచ్ఎంసి నైట్ షెల్టర్ లకి తరలించాలని ఆదేశించారు. భవనాలు నిర్మిస్తున్న ప్రాంతాలను తనిఖీ చేసి, సెల్లార్ తవ్వకాల వలన ప్రమాదాలు జరగకుండా చూడాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.