అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం అపూర్వ కానుక అందజేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం ఆరోగ్య మహిళ పథకం ప్రారంభించింది. కరీంనగర్లో ఈ పథకానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శ్రీకారం చుట్టారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు.
మహిళల కోసం చాలా పథకాలు తీసుకొచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యలక్ష్మి అనే పథకం తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ పథకంలో 8 రకాల చికిత్సలు ఉంటాయని వివరించారు. ఆరోగ్య మహిళ కింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆరోగ్య మహిళ కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.