కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశంలో అనేక రంగాలు తీవ్రంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే. ఇక మద్యం తయారీదార్లు కూడా విపరీతమైన నష్టాలను చవి చూస్తున్నారు. ఈ క్రమంలోనే దేశంలో ఉన్న మొత్తం 250 మైక్రో బ్రూవరీలలో దాదాపుగా 8 లక్షల లీటర్ల బీరు వృథా కానుందని ఆ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా గత 40 రోజులుగా దేశంలో మద్యం విక్రయాలు జరగకపోవడం, డిస్టలరీలు, బ్రూవరీలు మూత పడి ఉండడంతో పెద్ద ఎత్తున మద్యం స్టాక్ ఉంటోంది. దీంతో ఆయా బ్రూవరీలలో నిల్వ ఉన్న బీరు మద్యం షాపులకు సరఫరా కాకపోవడంతో.. అది వృథాగా మారుతుందని వారంటున్నారు.
ఇక లాక్‌డౌన్ వల్ల ఉత్తరభారతదేశంలో రూ.700 కోట్ల విలువైన 1.2 మిలియన్ కేసుల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ కూడా స్టాక్ ఉందని విక్రయదారులు చెబుతున్నారు. అయితే మే 4వ తేదీ నుంచి ఆయా రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ స్టాక్‌ను అంతా క్లియర్ చేయాలని విక్రయదారులు చూస్తున్నారు. అయితే మద్యం ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది కానీ బీర్ కాలపరిమితి చాలా తక్కువ కనుక విక్రయదారులు ఒకేసారి పెద్ద ఎత్తున బీర్ స్టాక్‌ను క్లియర్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి తీవ్రమైన నష్టాలు వచ్చేందుకు అవకాశం ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు.
అయితే పెద్ద ఎత్తున స్టాక్ ఉన్న బీర్లను త్వరగా విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విక్రయదారులకు పలు ప్రత్యేక అనుమతులు ఇస్తాయేమో చూడాలి. లేదా.. బీర్లను తక్కువ ధరలకే విక్రయించే ఏర్పాటు అయినా చేస్తే.. విక్రయదారులకు నష్టం రాకుండా ఉంటుందని.. ఆ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి..!