నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం లో తనపై నిందలు వేసేందుకు నీతీశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు.నీట్ అంశంపై తనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి తేజస్వీ యాదవ్ సవాల్ విసిరారు.
నీతీశ్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, నేరాల్ని ప్రోత్సహిస్తోందనిఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఒక ఇంజిన్ అవినీతిని, మరో ఇంజిన్ నేరాలను ప్రమోట్ చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పేపర్ లీకైనా, వంతెనలు కూలినా, హత్యలు జరిగినా.. రాష్ట్రంలో ప్రతి సమస్య తేజస్వీ వల్లేనంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వద్ద ఆధారం ఉంటే ఆరోపణలు మాని అరెస్టు చేసుకోవచ్చని సవాల్ విసిరారు.నీట్- యూజీ ప్రవేశపరీక్ష 2024 లో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ వెనక తేజస్వీ యాదవ్ సహాయకుడి ప్రమేయం ఉందంటూ బిహార్ ఉపముఖ్యమంత్రి ఇటీవల ఆరోపించడంపై ఆర్జేడీ కౌంటర్ ఇచ్చింది. బిహార్‌లోని సీనియర్ మంత్రులతో ఇతర కీలక అనుమానితులు ఉన్న ఫొటోలను రిలీజ్ చేసింది.