కరోనా వైరస్ పలు భిన్న రకాల ఉపరితలాలపై ఎంత సమయం పాటు ఉండగలుగుతుంది.. అనే విషయాలను ఇప్పటి వరకు సైంటిస్టులు వెల్లడించారు. కానీ సూర్యరశ్మి నిరంతరాయంగా తాకితే.. కరోనా వైరస్ ఎంత సేపు జీవించి ఉంటుంది.. అనే విషయాన్ని సైంటిస్టులు ఇంకా ధ్రువీకరించలేదు. అయితే.. తాజాగా సైంటిస్టులు ఆ ప్రయోగం కూడా చేశారు. ఈ క్రమంలో కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూర్యరశ్మిలో కరోనా వైరస్ నశించినట్లు సైంటిస్టులు నిర్దారించారు.
అమెరికాలోని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం కోసం పనిచేసే నేషనల్ బయో డిఫెన్స్ అనలిస్ట్స్ అండ్ కౌంటర్‌మీజర్స్ సెంటర్ పరిశోధకులు ల్యాబ్‌లో కరోనా వైరస్‌పై ప్రయోగాలు చేశారు. బయటి వాతావరణాన్ని పోలిన వాతావరణాన్నే ల్యాబ్‌లో కల్పించారు. ఇక వైరస్‌ను తాకే సూర్యరశ్మిని కూడా ల్యాబ్‌లోనే కృత్రిమంగా సృష్టించారు. ఈ క్రమంలో వైరస్ మొదటి 7 నిమిషాలలో 90 శాతం వరకు నశించిందని, తరువాత 14.3 నిమిషాల్లో చాలా వరకు నాశనం అయిందని గుర్తించారు. అధిక వేడి ఉండే సూర్యరశ్మి వైరస్‌ను నిరంతరం తాకేలా వారు ల్యాబ్‌లో వాతావరణం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సూర్యరశ్మి వల్ల కరోనా నశిస్తుందని తేల్చారు.
అయితే ఉష్ణోగ్రతలు వేడిగా ఉండే వాతావరణంలో బయట కరోనా వైరస్ ఎక్కువ సేపు ఉండలేదని, కానీ ఇండ్ల లోపల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కనుక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు సూచిస్తున్నారు. ఇక ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు చేస్తామని వారు తెలిపారు.