వస్తు సేవల పన్ను కి సంబంధించిన వ్యాపార రిజిస్ట్రేషన్ పరిమితిని పెంచతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో చిన్న వ్యాపారులకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఊరట లభించనుంది. ప్రస్తుతమున్న పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.40లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కాంపొజిషన్ పథకం కింద ఉండే ఈ పరిమితిని రూ.కోటి నుంచి రూ.1.5 కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల వ్యాపారులకు లాభం చేకూరే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా… ”కాంపొజిషన్ పథకం కింద వ్యాపారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్నులు చెల్లించాలి. కానీ, రిటర్న్ మాత్రం ఏడాదికి ఒకసారి మాత్రమే దాఖలు చేయాలి. కాంపొజిషన్ పథకం పరిమితిని కోటి రూపాయలు నుంచి రూ.1.5 కోట్లకు పెంచాం. 2019 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందన్నారు. దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఈ నిర్ణయం మరింత లబ్ది చేకూరనుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర జీఎస్టీ మొదలుకుని అన్ని విషయాల్లోనూ రివ్యూ చేసుకోవడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.