బైక్‌పైనే సీఎం 122 కిలోమీట‌ర్ల రైడ్‌… రీజ‌న్ ఇదే

-

లీడర్ సినిమాలో అర్జున్ ప్రసాద్… ఈ పేరు చెప్పగానే మీకు టాలీవుడ్ కండల హీరో దగ్గుపాటి రానా గుర్తుకు వస్తాడు కదా..! ఆ సినిమాలో సీఎంగా నటించిన రానా సీఎం హోదాలో బైక్ వేసుకుని రోడ్లపై తిరగటం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. హీరోయిన్ కోరిక మేరకు ఆమెను సరదాగా బైక్ పై బయటకు తీసుకు వెళతాడు. అయితే అదంతా రీల్ లైఫ్ లో జరిగింది. కానీ రియల్ లైఫ్ లోనూ ఒక సీఎం రోడ్డుపై బైక్ మీద ప్రయాణం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన సరదాకోసం రోడ్డుపై బైక్ రైడ్ చేయ‌లేదు.

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చేసిన ప్రమోషన్లలో భాగంగా ఆయన బైక్ పై దూసుకు పోతూ పరుగులు పెట్టించారు. ఇంతకీ ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ(40). అరుణాచల్ ప్రదేశ్ ప్రకృతి అందాలకు నెలవుగా ఉంటుంది. అయితే ఆ రాష్ట్రంలో పర్యాటకరంగం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందటం లేదు. అరుణాచలప్రదేశ్ పర్యాటకాన్ని ప్రపంచానికి పరిచయం చేసే క్రమంలో, ఆ రాష్ట్ర పర్యాటక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

ఈ క్రమంలోనే సీఎం సైతం తనవంతుగా బైక్ పై రైడింగ్ చేసి ప్రమోషన్లలో పాల్గొన్నారు. పెమా ఖండూ ఈ ప్రమోషన్లో భాగంగా ఏ కిలోమీటరో….. పదికిలోమీటర్లలో బైక్ రైడింగ్ చేయలేదు. ఏకంగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేయటం విశేషం. ఇంగ్ కోయింగ్ నుంచి పసి ఘాట్ వరకు ఖండూ బైక్ రైడ్ చేస్తూ సియాంగ్ నది అందాలని నెటిజన్ల కళ్ళకు కట్టినట్లు చూపించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పై దాదాపు 122 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి ఆ రాష్ట్ర ప్రజల మనసులను దోచుకున్నారు. అలాగే అరుణాచలప్రదేశ్ రహదారులు ఎంతో సురక్షితమైనవి అని ఆయన ట్వీట్ చేశారు.

ఖండూ ప్రయాణించిన దారిలో ఉన్న అందాలన్నింటినీ వీడియో రూపంలో షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడు అవి జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు సైతం యంగ్ సీఎం సార్ మీరు చాలా గ్రేట్… అరుణాచల్ ప్రదేశ్ పర్యాటకంపై విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసిస్తున్నారు. కాగా, ఖండూ గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news