కిలో టీ పొడి ధర రూ.99,999.. కేవలం 2 కిలోలే ఉత్పత్తి.. రికార్డులు తిరగరాసిన గోల్డ్ టీ

కిలో టీ పొడి ధర ఎంత ఉంటుంది. మా అంటే రూ.500. మంచి క్వాలిటీ అయితే వెయ్యో లేక రెండు వేలో ఉంటుంది. ఒకవేళ కిలో టీ పొడి ధర అక్షరాల రూ. లక్ష పలికితే! అయ్య బాబోయ్ ఎక్కడ అంటారా? అదేనండి టీ, కాఫీ తోటలకు ప్రసిద్ధి చెందిన అసోంలో. మంగళవారం అసోంకు చెందిన ప్రత్యేకమైన టీ పొడిని వేలం వేయగా రికార్డు స్థాయిలో కిలో రూ.99,999 పలికింది.

అసోం రాజధాని గువాహటి టీ వేలం పాట కేంద్రంలో ‘మనోహరి గోల్డ్ టీ’ వేలం పాట నిర్వహించారు. కిలో రూ.99,999 చొప్పున సౌరవ్ టీ ట్రేడర్స్ టీ పొడి టెండర్స్‌ను దక్కించుకున్నారు. ఇంత ధర పలకడం ఇదే తొలిసారి.

గత ఏడాది నిర్వహించిన వేలం పాటలో మనోహరి గోల్డ్ టీ కిలో రూ.75,000 పలికింది. ఆ ఏడాది ఇదే అత్యధిక ధర.

మేం మరోసారి చరిత్ర సృష్టించాం. మంగళవారం ఉదయం గువాహటి టీ వేలం పాట కేంద్రంలో కిలో గోల్డ్ టీ రూ.99,999 పలికింది. నాణ్యత విషయం మేం ఎప్పుడు రాజీ పడలేదు. మా దగ్గర నాణ్యతకు అంత ప్రాధాన్యత ఉంటుంది. మేం ఈ రోజు ఎంతో సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే అసోం టీ కీర్తిని మరోసారి ఎలుగెత్తి చాటాం అని మనోహరి టీ ఎస్టేట్స్ యజమాని రాజన్ లోహియా తెలిపారు.

మేం ఉత్తమమైన లవంగం పీ-126తో చిన్న మొగ్గతో టీని తయారు చేశాం. ప్రతి సంవత్సరం 10 కిలోల గోల్డ్ టీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కానీ, ఈ ఏడాది కేవలం 2 కిలోలు మాత్రమే దిగుబడి వచ్చింది. టీ ఉత్పత్తికి అసోం రాష్ట్ర వాతావరణం, నేల నాణ్యత చాలా బాగా ఉన్నాయని పేర్కొన్నారు. మేం నాణ్యతకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం అని లోహియా పేర్కొన్నారు.

టీ పరిశ్రమ సంక్షోభం లోహియా మాట్లాడుతూ అసోం టీ పరిశ్రమను నాణ్యత మాత్రమే కాపాడుతుందని తెలిపారు. అసోం టీ దాని అద్భుతమైన నాణ్యత కారణంగా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది అని పేర్కొన్నారు.

మనోహరి ఎస్టేట్స్ సుమారు 1000 ఎకరాల్లో విస్తరించింది. ఇక్కడ 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

2018లో జరిగిన వేలం పాటలో మనోహరి గోల్డ్ టీ కిలో రూ.39,000లకు సౌరభ్ టీ ట్రేడర్స్ దక్కించుకున్నారు. ఏడాది తర్వాత అదే కంపెనీ కిలో రూ.50,000లకు సొంతం చేసుకున్నది.

2020లో జరిగిన వేలం పాటలో విష్ణు టీ కంపెనీ కిలోకు రూ.75,000 వెచ్చించి మనోహరి గోల్డ్ టీని దక్కించుకున్నది.