భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త సదుపాయాలను అందిస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఏటీఎం విత్‌డ్రా మోసాలను అరికట్టేందుకు ఇప్పటికే ఓటీపీ ఆధారిత లావాదేవీలను ప్రవేశపెట్టింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఏటీఎంలో రూ.10వేలు అంతకన్నా ఎక్కువ మొత్తంలో నగదు విత్‌డ్రా చేస్తే వారికి ఏటీఎం తెరపై నగదు విత్‌డ్రాకు ముందు ఓటీపీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేశాకే నగదు విత్‌డ్రాకు అవకాశం ఉంటుంది. దీని వల్ల ఏటీఎంలలో నగదు విత్‌డ్రా మోసాలను అరికట్టవచ్చు.
అయితే ఎస్‌బీఐ సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ఇలా ఓటీపీ ఆధారిత నగదు విత్‌డ్రాను ప్రవేశపెట్టగా.. ఈ సేవ ఇప్పటి వరకు రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ దీన్ని ఇప్పుడు ఎస్‌బీఐ కస్టమర్లు రోజుకు 24 గంటలూ ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఈ మేరకు ఎస్‌బీఐ తాజాగా ఓ ట్వీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.
అయితే ఎస్‌బీఐ కాకుండా ఇతర బ్యాంక్‌లకు చెందిన ఏటీఎంలలో ఓటీపీ ఆధారిత నగదు విత్‌డ్రా పనిచేయదు. కేవలం ఎస్‌బీఐ ఏటీఎంలలో మాత్రమే ఈ సేవను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గాను కస్టమర్లు తమ మొబైల్ నంబర్లను రిజిసర్ట్ చేసుకుని ఉండాలి. అలర్ట్స్ కోసం రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఏటీఎంలో తెరపై ఎంటర్ చేయడం ద్వారా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.