ఎమ్మెల్యే శంకర్ అనుచరుల దాడి.. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఉద్రిక్తత!

-

ఆదిలాబాద్ రిమ్స్‌లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అర్ధరాత్రి మెడికల్ కాలేజ్ విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడి వెనక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనుచరులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడానికి ఒకరోజు ముందే అప్పుడే తన ప్రతాపం చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడికి నిరసనగా రిమ్స్‌లో విధులు బహిష్కరించారు జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు. ధర్నాకు దిగిన విద్యార్థులకు, జూనియర్ డాక్టర్లకు మాజీ మంత్రి జోగు రామన్న సంఘీభావం తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రిమ్స్ ఎదుట ధర్నా చేపట్టిన విద్యార్థులు, జూడాలు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్, డాక్టర్ క్రాంతిల దిష్టిబొమ్మలను తగలబెట్టారు. అక్కడి నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయలుదేరారు.

రిమ్స్ మెడికల్ క్యాంపస్‌లో చోటు చేసుకున్న ఘటనలపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా చొరబడ్డ దుండగులు కారుతో గేట్‌ను ఢీకొట్టడమే కాకుండా సహచర విద్యార్థులను గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారుతో ఢీకొట్టిన ఘటనలో నవీన్ అనే విద్యార్థి ఎగిరిపడ్డాడు. అగంతకుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వెనక రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి ఉన్నట్టు చెబుతున్నారు. వారి ప్రోద్బలంతోనే దుండగులు క్యాంపస్‌లోకి వచ్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీనికి ఎమ్మెల్యే అనుచరులకు కూడా లింక్ ఉందని అంటున్నారు. రిమ్స్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమేరాల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news